జలగం వెంగళరావు పార్క్ బోసిపోయింది.. అభివృద్ధి చేయాలని ప్రజల ఆకాంక్ష
పార్కు నిర్వహణ, అభివృద్ధి లేక వెలవెలబోతుండటంపై ప్రజల్లో ఆందోళన
ఆధునిక సౌకర్యాలతో జలగం వెంగళరావు పార్కును పునరుద్ధరించాలని డిమాండ్
సత్తుపల్లి ఆగస్టు 8 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జలగం వెంగళరావు పార్క్(Jalagam Vengala Rao Park) చూడడానికి బోసిపోయిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాడు చుట్టూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. అయితే, నేటి రాజకీయ పరిస్థితుల్లో గత పాలకులు చేపట్టిన మంచి కార్యక్రమాలను కొనసాగించడం కంటే, వాటిని రాజకీయ కోణంలో చూసే ధోరణి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సత్తుపల్లిలోని జలగం వెంగళరావు పార్కు పరిస్థితి ప్రజల్లో ఆందోళన కలిగిస్తోందని వారు వ్యక్తం చేస్తున్నారు.
ఆనాడు ఒక ఆలోచన.. నేడు ఒక ఆవేదన.
పాలకులు మారారు. కానీ పార్కు అభివృద్ధి, నిర్వహణ, పర్యవేక్షణ వంటి అంశాలు క్రమంగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. జలగం వెంగళరావు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలోకి రంగప్రవేశం చేశారు. ఆయన జ్ఞాపకార్థంగా హైదరాబాద్‌లోనూ, సత్తుపల్లిలోనూ పార్కులను నిర్మించారు. ఆయన సత్తుపల్లికి ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేయించారు. అధికారాలు శాశ్వతం కావు. కానీ ప్రజల కోసం చేసిన మంచి పనులు, చూపిన దూరదృష్టి మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు రాజకీయాలకు అతీతంగా స్పందించి, “మన ఊరు... మన పార్కు” అనే భావనతో జలగం వెంగళరావు పార్కును ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించి, ప్రజలకు మళ్లీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలని పార్క్ ప్రేమికులు, ప్రజలు కోరారు.






