14 July, 2026 | 11:38 PM

జేమ్స్ మేనియా..

28-04-2024 12:25 AM

ఢిల్లీ ఓపెనర్ మెక్‌గ్రూక్ విధ్వంసం 

ముంబైపై 10 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం 

n  తిలక్ వర్మ ఒంటరి పోరు

పరుగుల వరద పారిన పోరులో ఢిల్లీని విజయం వరించింది. ఓపెనర్ మెక్‌గ్రూక్ మేనియాలో ముంబై కొట్టకుపోయింది. ఆఖరి బంతి దాకా వచ్చిన మ్యాచ్‌లో ముంబై పరాజయం వైపు నిలిచింది. మొదట ఢిల్లీ ఓపెనర్ మెక్‌గ్రూక్ విధ్వంసానికి తోడు హోప్, స్టబ్స్‌లు  మెరుపు ఇన్నింగ్స్‌లతో ఢిల్లీ భారీ స్కోరు చేయగా.. ఛేదనలో టాపార్డర్ విఫలమైనప్పటికి తిలక్ వర్మ, పాండ్యా రాణింపుతో ముంబై ఆఖరిదాకా పోరాడింది. ముంబై విజయం ఖాయమే అన్న దశలో తిలక్ వెనుదిరగడంతో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. 

జేమ్స్ మెక్‌గ్రూక్

పరుగులు: 84

బంతులు: 27

స్ట్రుక్‌రేట్: 311.11

బౌండరీలు: 11

సిక్సర్లు: 6

ఢిల్లీ:  ఐపీఎల్ 17వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతగడ్డపై మరో విజయాన్ని నమోదు చేసింది. డబుల్ హెడర్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 10 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయాన్ని అందుకుంది.  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఢిల్లీ ఓపెనర్ జేమ్స్ మెక్‌గ్రూక్ (27 బంతుల్లో 84; 11 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతులో 48 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడగా.. షెయ్ హోప్ (17 బంతుల్లో 41; 5 సిక్సర్లు) రాణించాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, వుడ్, చావ్లా, నబీలు తలా ఒక వికెట్  తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులకు పరిమితమైంది.

తిలక్ వర్మ ( 32 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ పాండ్యా ( 24 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకోగా.. టిమ్ డేవిడ్( 17 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పర్వాలేదనిపించగా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. ఢిల్లీ బౌలర్లలో రసిక్ సలామ్, ఖలీల్ అహ్మద్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ ఒక వికెట్ తీశాడు. మెరుపు అర్థసెంచరీతో ఢిల్లీ ఇన్నింగ్స్‌లో కీలకపాత్ర పోషించిన జేమ్స్ మెక్‌గ్రూక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. లీగ్‌లో భాగంగా ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనుండగా.. తొలి పోరులో గుజరాత్‌తో బెంగళూరు.. రెండో మ్యాచ్‌లో చెన్నై, హైదరాబాద్ తలపడనున్నాయి. 

మెక్‌గ్రూక్ విధ్వంసం..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్ జేమ్స్ మెక్‌గ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి బంతి నుంచే ముంబై బౌలర్లను లక్ష్యంగా చేసుకొని ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించిన మెక్‌గ్రూక్ 3 ఓవర్లలోనే జట్టు స్కోరును 55 పరుగులు దాటించాడు. కేవలం 15 బంతుల్లోనే అర్థసెంచరీ మార్క్‌ను అందుకొని సీజన్‌లో ఢిల్లీ తరపున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. పవర్ ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 92 పరుగులు కాగా.. అందులో మెక్‌గ్రూక్ చేసినవే 78 పరుగులు కాగా.. మరో ఓపెనర్ పొరేల్ 11 పరుగులు చేశాడు. దీన్ని బట్టి మెక్‌గ్రూక్ విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఇన్నింగ్స్ 8వ ఓవర్లో చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి నబీకి క్యాచ్ ఇవ్వడంతో మెక్‌గ్రూక్ 84 పరగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తెరపడింది. కాసేపటికే పొరేల్ (36) వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన షెయ్ హోప్ మెక్‌గ్రూక్ బాధ్యతను తీసుకున్నాడు.  ముంబై బౌలర్లపై భారీ సిక్సర్లతో విరుచుకుపడిన హోప్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ఢిలీ 16.1 ఓవర్లలో 200 మార్క్‌ను అందుకుంది. హోప్ వెనుదిరిగిన అనంతరం కెప్టెన్ పంత్ 29 పరుగులు చేసి ఔటవ్వగా.. ఆఖర్లో స్టబ్స్ అక్షర్ పటేల్ ( 6 బంతుల్లో 11 నాటౌట్)  అండతో చెలరేగి ఢిల్లీ స్కోరును 257 పరుగులకు చేర్చాడు.

పేలవ ఆరంభం..

అనంతరం లక్ష్య ఛేదనలో ముంబైకి పేలవమైన ఆరంభం లభించింది. ఓపెనర్ రోహిత్ శర్మ 8 పరుగులు మాత్రమే చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ మంచి ఈజ్‌తో ఇన్నింగ్స్ కొనసాగించినప్పటికి 26 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో తిలక్ వర్మ, కెప్టెన్ పాండ్యాలు కలిసి ముంబై ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పాండ్యా వెనుదిరిగినప్పటికి తిలక్ వర్మ ఒంటరిపోరాటం చేశాడు. గత మ్యాచ్‌లో ఇంపాక్ట్ చూపించిన నెహాల్ వదేరా ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్, తిలక్ వర్మ బౌండ్రీలు, సిక్సర్లతో విరుచుకుపడినప్పటికి స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్ కావడంతో ముంబై ఓటమి ఖరారైంది. 

సంక్షిప్త స్కోర్లు

ఢిల్లీ: 20 ఓవర్లలో 257/4 (మెక్‌గ్రూక్ 84, ట్రిస్టన్ స్టబ్స్ 48 నాటౌట్; బుమ్రా 1/35), ముంబై: 20 ఓవర్లలో 247/9 (తిలక్ 63, పాండ్యా 46 ; రసిక్ సలామ్ 3/34, ముకేశ్ 3/59)