జలం కోసం జనగళం
* పరీవాహక ప్రాంతం ఆధారంగా 66 శాతం కాకున్నా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కనీసం 50 శాతం నీటినైనా సాధించాలి. అందుకోసం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులను సరైన సమయంలో పూర్తిచేసేలా పక్కా ప్రణాళికలు రూపొందించాలి.
* ఈ ఏడాది తెలంగాణకు అమృత్‌కాల్. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చి ఈ ఏడాదితో 75 ఏండ్లు (ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత). ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయమైన నీటివాటాను సాధించేందుకు, పాలమూరుకు న్యాయం చేసేందుకు యాక్షన్ ప్లాన్ ప్రారంభిస్తే బాగుంటుంది.
పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే పాలమూరులోనా.. నా తెలంగాణలోనా అని పాడుకున్న పాలమూరు బిడ్డల దాహార్తి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లయినా ఇంకా తీరనేలేదు. జీవనది కృష్ణమ్మ తలాపునే పారుతున్నా ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు గొంతెండింది. గుక్కెడు నీళ్లకోసం మనుషులేకాదు.. పాలమూరు పశు, పక్ష్యాదులు కూడా అల్లాడాయి. దేశంలో ఎక్కడికి పోయినా పాలమూరు లేబరే కనిపించేవారు. ముంబాయి పోతున్న అమ్మ మాయమ్మా.. అని అరిగోస పడుతూ.. తాము కన్న పిల్లలను, తమను కన్న తల్లిదండ్రులను వదిలి వేలమంది పాలమూరు లేబర్ ఏండ్లకేండ్లు వలస పోయిన రోజులు కండ్లముందే ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మొదట ఏర్పడిన ప్రభుత్వం పాలమూరు నీటి వెతలను తీర్చేందుకు చర్యలు చేపట్టింది. కానీ, కృష్ణాలో న్యాయమైన నీటివాటాలు సాధించలేకపోయింది. కృష్ణా నీటిని పాలమూరుకు మళ్లించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రయత్నించారు. కేసీఆర్ తన పదేండ్ల పాలనలో కొత్తగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును మొదటు పెట్టారు. కానీ, పాత ప్రాజెక్టును పూర్తిచేయలేదు.. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేకపోయారు. సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టులపైనే ఆయన పూర్తిగా దృష్టిపెట్టారు.
ఏటా రూ. 3 వేల కోట్ల నష్టం
కృష్ణా నది పరీవాహక ప్రాంతం 66 శాతం తెలంగాణలోనే ఉన్నది. నీటి కేటాయింపులు మాత్రం 30 శాతమే ఉన్నాయి. అది కూడా 2015లో కుదరిన ఒప్పందం ప్రకారం తాత్కాలికమే. ఇలా దశాబ్దాలుగా తెలంగాణకు, ప్రత్యేకించి పాలమూరు జిల్లాకు కృష్ణా నీటి విషయంలో అన్యాయం జరుగుతూనే ఉన్నది. సాంకేతికంగా చూస్తే ఈ నీటి నష్టం తెలంగాణకు ఏటా రూ.3 వేల కోట్ల వరకు ఉంటుంది. ప్రభుత్వాలు, ట్రిబ్యునళ్లు వస్తున్నాయి పోతున్నాయి.. కోర్టులు కేసులు విచారిస్తూనే ఉన్నాయి. కానీ పరిష్కారం మాత్రం కనిపించటంలేదు. పరీవాహక ప్రాంతం ఆధారంగా 66 శాతం కాకున్నా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కనీసం 50 శాతం నీటినైనా సాధించాలి. అందుకోసం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులను సరైన సమయంలో పూర్తిచేసేలా పక్కా ప్రణాళికలు రూపొందించాలి.
దీర్ఘకాలంలో దేశాభివృద్ధితోపాటు తెలంగాణ న్యాయం చేసేలా చర్యలుండాలి. అంతేకాకుండా హైదరాబాద్ మహానగరానికి అదనపు నీటి భద్రత కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యూహాలు రూపొందించాలి. అదృష్టవశాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి పాలమూరు జిల్లాకు చెందినవారే. పాలమూరులో బీజేపీ ఎంపీ ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నది. రాష్ట్రంలో సమర్ధుడైన నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారు. నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ఈ రంగంలో లబ్దప్రతిష్టులు. ప్రభుత్వం ఏం చేసినా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధించేందుకే అయి ఉండాలి. ఈ ఏడాది తెలంగాణకు అమృత్‌కాల్. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చి ఈ ఏడాదితో 75 ఏండ్లు (ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత). ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయమైన నీటివాటాను సాధించేందుకు, పాలమూరుకు న్యాయం చేసేందుకు యాక్షన్ ప్లాన్ ప్రారంభిస్తే బాగుంటుంది.
- * తెలంగాణ రాష్ట్రం కృష్ణా నీటిలో ఏటా ఎన్ని టీఎంసీలు కోల్పోతున్నది? దాని వల్ల ఎంత ఆర్థిక నష్టం జరుగుతున్నదో లెక్కలు తీయాలి. ఆ లెక్కలను మీడియాలో ప్రచురించాలి.
- * నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలి. ప్రజల్లో కూడా ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాలి.
- * రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలందరితో అఖిలపక్ష సమావేశం నిర్వహించి నీటి అన్యాయంపై ప్రజల్లో అవగాహన మరింత పెంచాలి.
- * పాలమూరు జిల్లాలోని ప్రతిగ్రామంలో అఖిలపక్షం నాయకత్వంలో ప్రజల భాగస్వామ్యంతో కొవ్వొత్తుల ర్యాలీలు తీయాలి.
- * ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకొని కృష్ణా నీటి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకొనే మార్గాలను అణ్వేషించాలి.
- * రాష్ట్రం నుంచి అఖిలపక్ష బృందం ఢిల్లీకి వెళ్లి ప్రధానితోపాటు జల్‌శక్తి శాఖ మంత్రిని కలిసి సమస్యకు త్వరగా పరిష్కారం చూపాలని కోరాలి.
- * దేశంలోని అన్ని పార్టీల నేతలతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి సమస్యకు అర్ధవంతమైన పరిష్కారం లభించేలా చూడాలి.
- * దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సమస్య పరిష్కారంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌కు కూడా ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి.
- * రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలతో పాలమూరు జిల్లాకు ర్యాలీలు తీయాలి. లక్షల మందిని సమీకరించి భారీ సభలు నిర్వహించాలి. ఈ సభల్లో అన్ని పార్టీల నేతలు పాల్గొనేలా చూడాలి. ఈ కార్యక్రమాలకు కాంగ్రెస్ నాయకత్వం వహించాలి.
- * అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని కేసీఆర్, కిషన్‌రెడ్డి వంటి ప్రతిపక్ష నేతల ఇండ్లకు వెళ్లి వారితో చర్చలు జరుపాలి. నీటి వాటాల్లో అన్యాయం అంశాన్ని పెద్దదిగా చేసి ప్రజల్లో అవగాహన కలిగించాలి.
- * పూర్తి వివరాలు, నిజాలతో పార్లమెంటులో ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాలి. రాష్ట్ర ఎంపీలంతా పార్టీలకు అతీతంగా ఒక్కటిగా పోరాడాలి.
- * పదివేల మందితో పాలమూరు నుంచి విజవాడకు యాత్ర నిర్వహించి ఆంధ్ర పాలక, రాజకీయ వర్గాలతోపాటు ప్రజలను ఒప్పించి.. స్నేహపూర్వకంగా సమ స్యకు పరిష్కారం లభించేలా చూడాలి.
- * సమస్య పరిష్కారానికి అవసరమైన ఇతర చర్యలు చేపట్టాలి.
- * సమస్య పరిష్కారమయ్యేవరకు ప్రభుత్వం నిత్యం పర్యవేక్షించాలి.
- * ఇలాచేస్తూ సమస్యకు పరిష్కారం కనుగొంటే తెలంగాణ ప్రజలు, పార్టీలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడి ఇది చారిత్రక విజయమవుతుంది.
- తెలంగాణ గొంతుక అయిన విజయక్రాంతి దినపత్రిక ద్వారా అవసరమైనంత మేరకు 24 గంటలూ పూర్తి మద్దతు కొనసాగుతుంది.
సి.ఎల్.రాజం
చైర్మన్, విజయక్రాంతి






