హెల్త్ టూరిజం హబ్
వైద్య సేవలకు హైదరాబాద్ చిరునామా కావాలి
- బసవతారకం ఆసుపత్రికి ప్రభుత్వం అండ
- అభివృద్ధి, సంక్షేమంలో రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి
- సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
- బసవతారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవానికి హాజరు
- * 1000 ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్.
- * హైదరాబాద్‌లో అన్ని రకాల వైద్య సేవలు.
- * నేను 12 గంటలు పనిచేస్తే సరిపోదు. 18 గంటలు పని చేయాల్సిందే.
- * ప్రపంచానికి రెండు తెలుగు రాష్ట్రాలు ఆదర్శం కావాలి.
హైదరాబాద్, జూన్ 22 ( విజయక్రాంతి): తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్‌ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందుతాయనేలా దానిని తీర్చిదిద్దుతామన్నారు. శంషాబాద్‌లో 500 నుంచి 1000 ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని సీఎం వివరించారు. అందులో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కచ్చితంగా చోటు ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ 24వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు సీఎం జ్యోతిప్రజ్వల న చేయగా ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ, ఎమ్మె ల్యే నందమూరి బాలకృష్ణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ఎంపీ భరత్ తదితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆలోచనలతో ఏర్పడ్డ ఈ ఆసుపత్రి 24 ఏళ్లుగా కోట్లాది మందికి సేవలందించడం సంతోషంగా ఉందన్నారు. పేద లకు వైద్య సేవలు అందించే ఉద్దేశంతో అనా డు ఎన్టీఆర్ ఈ ఆసుపత్రి నిర్మాణానికి పూనుకున్నారని, ఎన్టీఆర్ ఆలోచన విధానాలను కొనసాగించాలని చంద్రబాబునాయుడు ఆసుపత్రిని పూర్తి చేసి పేదలకు సేవలు అం దించేలా చేశారని సీఎం పేర్కొన్నారు.
పేదలకు వైద్య సేవలు అందించాలన్న ఎన్టీఆర్ ఆలోచనలు అమలవుతున్న తీరు చూసి.. స్వర్గం నుంచి ఎన్టీఆర్ మనల్ని ఆశీర్వదిస్తారని అన్నా రు. ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్న రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎన్టీఆర్ మూడో తరం కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు. బవవతారకం ఆసుపత్రి సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుందన్నా రు. ఆసుపత్రికి సంబంధించిన భూమి లీజు విషయంలో మంత్రి వర్గంలో చర్చిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సంకీర్ణ రాజకీయాలకు పునాదులు వేసింది ఎన్టీఆరేనని, రూ. 2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. లోకేష్, భరత్ కలిసి రాజకీయాలు, సంక్షేమం బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. ఆసుపత్రి 25వ వార్షికోత్సవానికి రావాలని బాలకృష్ణ కోరారని, 30 వార్షికోత్సవానికి సీఎం హోదాలో తానే వస్తానని రేవంత్‌రెడ్డి అన్నారు.
బసవతారకం ఆసుపత్రి సేవలు మరింత విస్తరిస్తాం : బాలకృష్ణ
క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తోందని బవసతారం మేనేజింగ్ ట్రస్టీ, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సేవల విస్తరణ కోసం సహకారం కోరిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి అంగీకారం తెలిపారని ఆయన చెప్పారు. దాతల సహకారంతో ఆసుపత్రి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నదని ఆయన హర్షం వ్యక్తం చేశారు. బసవతారకం ఆసుపత్రి సేవలను మరింతగా విస్తరిస్తామన్నారు.
గురుశిష్యుల అభివృద్ధి మంత్రం!
అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీపడి పనిచేస్తా
* ఆంధ్రప్రదేశ్‌కు ఒకే ఒక్క రాజధాని అమరావతి. లక్ష కోట్లతో అమరావతి అభివృద్ధి.
* హైదరాబాద్ అభివృద్ధి చెందినట్టే, అమరావతిని కూడా అభివృద్ధి చేస్తాం.
* ఆంధ్రప్రదేశ్‌కు కంపెనీలను ఆహ్వానిస్తాం.
రాజకీయం, సంక్షేమం ఎన్టీఆర్ వారసత్వంగా ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో పోటీ పడి పనిచేసే అవకాశం తనకు వచ్చిందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో ప్రపంచానికి రెండు తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలవాలన్నారు. చంద్రబాబు రోజుకు 18 గంటలు పనిచేసి, తాను 12గంటలు పనిచేస్తే సరిపోదని, రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పని చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.
‘ మనలో ఉన్న సామర్థ్యం వెలికి రావాలి. గుర్తింపు రావాలంటే నైపుణ్యం ఉన్న ఆటగాడితో పోటీపడాలని పెద్దలు చెబుతుంటారు. ఈ రోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి, సంక్షేమంతో వారితో పోటీపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పని చేస్తే సరిపోతుందని అనుకున్నా. కానీ, ఇప్పుడు వారు 18 గంటలు పని చేస్తుంటే నేను మునుపటిలా పని చేస్తే సరిపోదు ’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.






