9 May, 2026 | 12:42 AM

కస్టమ్స్ షోకాజ్ నోటీసులు సబబే!

23-06-2024 01:00 AM

శ్రీకృష్ణ ఎగ్జిమ్ ఎల్‌ఎల్పీకి హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): బంగారం కడ్డీల దిగుమతి, ఆభరణాల ఎగుమతుల్లో సుంకం ఎగవేతకు సంబంధించిన ఆరోపణలపై కస్టమ్స్‌శాఖ జారీ చేసిన షోకాజ్ నోటీసుల వ్యవహారంలో శ్రీకృష్ణ ఎగ్జిమ్ ఎల్‌ఎల్పీకి హైకోర్టులో చుక్కెదురైంది. సుంకం ఎగవేతలపై సోదాలు నిర్వహించిన అనంతరం 2022లో జారీ చేసిన షోకాజ్ నోటీసులను సవాలు చేస్తూ శ్రీకృష్ణ ఎగ్జిమ్ ఎల్‌ఎల్పీ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. శ్రీకృష్ణ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్లపై శనివారం జస్టిస్ పి.శ్యాం కోశీ, జస్టిస్ ఎన్.తుకారాంజీతో కూడిన ధర్మాసనం విచారించింది. చట్టబద్ధమైన సంస్థలు నిబంధనలకు లోబడి జారీ చేసిన షోకాజ్ నోటీసుల్లో కోర్టు జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది.

సహజ న్యాయసూత్రాలకు, చట్టవిరుద్ధంగా నోటీసులు జారీ అయినపుడు మాత్రమే కోర్టులు రాజ్యాంగబద్ధమైన విచక్షణ అధికారంతో జోక్యం చేసుకుంటాయని తేల్చి చెప్పింది. నగల తయారీ, ఎగుమతులు చేపట్టడానికి బంగారు కడ్డీలను దిగుమతి చేసుకోవడంలో పన్ను ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో కస్టమ్స్ అధికారులు గతంలో శ్రీకృష్ణ గ్రూప్ కంపెనీలతో పాటు సంస్థ అనుబంధ సంస్థలు, డైరెక్టర్ల ఇండ్లలో సోదాలు నిర్వహించి సీజ్ చేశారు. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 28(4) ప్రకారం రెండు షోకాజ్ నోటీసులు జారీ చేయగా శ్రీకృష్ణ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది.