ఆదివాసీల ఆరాధ్య దేవత జంగు బాయి
- గూడాల్లో చైత్ర మాస పూజలు ఆరంభం
- మొక్కులు తీర్చుకునేందుకు కాలినడకన పుణ్యక్షేత్రానికి
ఆదివాసీ గోండు.. కొలం గిరిజనుల ఆరాధ్య దేవత కొలువుదీరి న పుణ్యక్షేత్రం జంగుబాయి స్థావరం.. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో కొన్ని వందల ఏళ్ల క్రితం వెలసిన జంగుబాయి దేవత మొక్కులు తీర్చుకునేందుకు మండుటెండను సైతం లెక్కచేయకుండా దేవత కొలువుదీరిన అడవి ప్రాంతానికి గిరిజను లు బయలుదేరి వెళుతున్నారు.
గోండి భాషలో (బావే మైన) చైత్రమాస పూజలు చేయడం ఆదివాసులకు సంస్కృతి సాంప్రదాయం గా.. ఆచారంగా వస్తుంది. ప్రతి ఏటా చైత్రమాసంలో దేవతకు ప్రత్యేక పూజలు చేసి ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసే విత్తనాలను సమర్పించడం అనాదిగా వస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనులతో పాటు పక్క మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లోని గిరిజనులు కుటుంబ సమేతంగా జంగుబాయి పుణ్యక్షేత్రానికి చేరుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
భక్తుల ప్రగాఢ నమ్మకం
ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రారంభానికి ముందు జంగుబాయి దేవతా సన్నిధిలో ఖరీఫ్‌లో సాగు చేసే విత్తనాలను దేవతకు సమర్పించి పంటలు బాగా పండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని వేడుకోవడం ఆనవాయితీగా వస్తుంది.జంగుబాయి దేవతకు విత్తనాలను సమర్పిస్తే పంటలు బాగా పండుతాయని ఆదివాసి గిరి జనులు ప్రగాఢ నమ్మకం.
దేవతల ఆశీస్సులు తీసుకొని..
చైత్రమాసం (మే నెల)లో ఆదివాసి గూడాల్లో గ్రామ పటేల్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశమై జంగుబాయి దేవతతో పాటు పెర్స పెన్ దేవతల పూజలపై ప్రత్యేక నిర్ణయం తీసుకుంటారు. దీంతో దేవతల మొక్కులు తీర్చుకునేందుకు మండుటెండలో కాలినడకతో బయలుదేరి వెళ్తారు. పూజలు ముగిసే వరకు గిరిజనులు బయటకు వెళ్లిన సమయంలో ఇతరులు ఇచ్చే మంచినీళ్లను సైతం ముట్టుకోరు. దేవతల మాసంగా చైత్ర మాసంను పవిత్ర మాసంగా ఆదివాసులు భావిస్తారు.ఈ మాసంలో జంగుబాయి దేవతతో పాటు పెర్సపెన్ పూజల మాసంగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈనెల 22న జంగుబాయి పుణ్యక్షేత్రంలో చైత్రమాసం పూజలకు గిరిజన పెద్దలు శ్రీకారం చుట్టారు.
నేటి నుంచి పుణ్యక్షేత్రానికి బయలుదేరనున్న గిరిజనం
ఆదివారం నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని కేరా మేరీ మండలం సరిహద్దులోని మహారాష్ట్ర సరిహద్దులోని మహారాజుగూడా అడవుల్లో కొలువుదీరిన జంగు భాయి దేవత మొక్కులు తీర్చుకునేందుకు ఆదివాసి గిరిజనులు సిద్ధమయ్యారు. కాలి నడక తో వెళ్లి మొక్కులు తీర్చుకోవడం ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయంలో ఒక భాగం. మొక్కులు తీర్చుకునేందుకు గిరిజన కుటుం బాలు ఎంతో నియమ.. నిష్ఠలతో ఇండ్లను శుభ్రం చేసుకుని, దేవత కు దీపాలంకరణ కోసం కావలసిన నువ్వుల నూనె ఇంటి వద్దనే గల గానుగలు తీసి ప్రత్యేక పూజ సామాగ్రితో బయలుదేరుతున్నారు.
బండారి లక్ష్మీనర్సయ్య, ఉట్నూర్ (విజయక్రాంతి)
ఆనవాయితీగా మొక్కులు తీర్చుకోవడం..
ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా చైత్రమాసంలో దేవతల మొక్కులు తీర్చుకోవడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ.. ప్రతి ఏటా మే నెలలో కోసుల దూరం కాలి నడకతో వెళ్లి మొక్కలు తీర్చుకుంటాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల, కరీంనగర్, మహారాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి ఆదివాసి గిరిజనులు వేలాదిగా తరలివస్తారు. నెలరోజులపాటు మొక్కులు తీర్చుకోవడం కోసం గిరిజనులు ఎంతో నియమ, నిష్ఠలతో అడవి ప్రాంతానికి చేరుకుంటారు.
సలాం శ్యాంరావు,
జంగుబాయి ఆలయ, ఉత్సవ కమిటీ చైర్మన్






