26 April, 2026 | 1:25 AM

శభాష్.. మే‘స్త్రీ’!

26-04-2026 12:04 AM

భవన నిర్మాణ రంగంలో స్ఫూర్తి నిస్తున్న బానోత్ కాంతమ్మ!

మహబూబాబాద్, విజయక్రాంతి : ఆమె మారుమూల గిరిజన ప్రాంతం మహిళ.. వ్యవసాయ పనులు లేనప్పుడు గృహ నిర్మాణ కూలి.. కుటుంబ పోషణ కోసం పనికెళ్లి.. గృహ నిర్మాణ రంగంలోని మెలకువలను నేర్చుకొని మే‘స్త్రీ’గా ‘రాణి’స్తూ మహిళ లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఆమె.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బానోత్ కాంతమ్మ. ఇంటికన్నె శివారు నక్కలగుట్ట తండాకు చెందిన కాంతమ్మ 12 ఏళ్ల క్రితం కేసముద్రం పట్టణానికి చెందిన శ్రీను మేస్త్రీ వద్ద భవన నిర్మాణ రంగంలో కూలీగా అడుగుపెట్టింది.

క్రమక్రమంగా గృహ నిర్మాణంలో పనులైన రాడ్ బెండింగ్, కట్టుబడి, గిలాబ్, స్లాబ్ పనుల్లో మెలుకువలు వంట పట్టించుకుని మేస్త్రీగా రాణిస్తోంది. కూలికి ఇచ్చే రోజువారీ డబ్బు కంటే మేస్త్రీకి కొంత మెరుగైన కూలి పొందుతోంది. తనతోపాటు మరికొందరికి ఈ రంగంలో రాణించడానికి స్ఫూర్తిగా నిలుస్తోంది బానోత్ కాంతమ్మ.

తన భర్త పూలుకు తోడుగా వ్యవసాయ పనుల్లో పాల్గొంటూ, మిగతా రోజుల్లో మేస్త్రీగా విధులు నిర్వహిస్తూ తన ఇద్దరు కుమారులు గణేష్, నరేష్‌ను ఉన్నత విద్యావంతులను చేసింది. గణేష్ ఆర్మీలో పనిచేస్తుండగా, నరేష్ ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. సాధారణ మహిళగా రోజువారీ కూలీ పనులతో కాకుండా.. వినూత్నమైన విభిన్నమైన గృహ నిర్మాణ రంగంలో మేస్త్రీగా గుర్తింపు పొందిన కాంతమ్మ మహిళ లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

 బండి సంపత్ కుమార్,