16 August, 2026 | 6:26 PM

నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

16-08-2026 04:56 PM

జిల్లా కార్యదర్శి కే. చంద్రశేఖర్ డిమాండ్

కామారెడ్డి, ఆగస్టు 16,(విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ యువతకు ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కే. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. కామారెడ్డిలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను గుర్తించి ప్రత్యేక నియామక క్యాలెండర్ ప్రకటించాలని, నిరుద్యోగులకు వయోపరిమితి సడలింపుతో పాటు పోటీ పరీక్షలకు తగిన అవకాశాలు కల్పించాలని కోరారు.

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి 2014లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, 12 సంవత్సరాలు గడిచినా ఆ హామీని నెరవేర్చలేకపోయిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించి, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని, రెండున్నరేళ్లు గడుస్తున్నా కేవలం 16 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయకుండా, కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటూ, హాస్టళ్లలో ఉంటూ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోందని తెలిపారు. కనీసం ప్రభుత్వేతర రంగాల్లోనైనా ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.5 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధి సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 20న కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహించనున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. యువతీ, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకట్ గౌడ్, మొతీరామ్,  కొత్త నరసింహులు, అరుణ్ ,రేణుక ,రాజనర్సు, దొడ్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు