27 April, 2026 | 8:50 PM

యాదగిరిగుట్టలో రెండవ రోజు ఘనంగా జయంతి ఉత్సవాలు

27-04-2026 06:33 PM

లక్ష పుష్పార్చన

కాళీయ మర్దనుడిగా నారసింహుడు

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో వార్షిక జయంతి మహోత్సవములు శ్రీ పంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా పంచకుండాత్మక యాగ సహిత మహోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఐదురోజుల జయంతి ఉత్సవములలో భాగముగా సోమవారం రెండవరోజు ఉదయం స్వామివారి ఆలయ ఆస్ధానమంటపములో లక్షపుష్పార్చన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి వారి అలంకార సేవతో పురవీధులలో ఊరేగింపు స్వామి వారు   యజ్గశాలలో నృసింహ మహాలక్మీ మూల మంత్రహవనములు, సుదర్శన శతకహవనము పారాయణీక పండితులచే మూలమంత్ర జపములు నిర్వహించి పూర్ణాహుతి నిర్వహించారు.

సాయంత్రము కాళీయమర్ధన అలంకరణలో లక్ష్మీ నరసింహ స్వామివారు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు పునీతులయ్యారు. యజ్గశాలలో నిత్యవిధి మూలమంత్ర మూర్తిమంత్ర హవనములు జపములు నిర్వహించి పూర్ణాహుతి తదుపరి రాత్రి నివేదన తీర్ధప్రసాదాలను భక్తులకు అందించారు. ఈ వేడుకల్లో ఆలయ కార్య నిర్వహణ అధికారి భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి, ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, పండితులు ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు.