మూడేళ్లలో 30వేలమందికి ఉద్యోగాలు
* ‘బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్లింగ్’ పేరిట ప్రత్యేక కోర్సు
* ఏటా 10వేల మంది బీటెక్, డిగ్రీ పట్టభద్రులకు శిక్షణ
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): వచ్చే మూడేళ్లలో 30 వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్లింగ్’ పేరుతో ప్రత్యేక కోర్సును యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా బీటెక్ పట్టభద్రుల కోసం ప్రారంభించిన ‘బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్లింగ్’ కోర్సుకు విశేష స్పందన లభిస్తోంది. ఆదివారం ఈ కోర్సుకు అర్హత పరీక్ష నిర్వహించారు.
వీరిలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ ఏడాది జూలై వరకు బ్యాంకింగ్ ఆపరేషన్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, సాఫ్ట్‌వేర్, ప్రోగ్రామింగ్, అప్లికేషన్ అండ్ డేటాబేస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కం ప్యూటింగ్, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో శిక్ష ణ ఇస్తారు.
ఇప్పటికే రెండు బ్యాచ్‌లను విజయవంతంగా పూర్తిచేసినట్లు కోర్సు నిర్వాహకు లు తెలిపారు. స్కిల్లింగ్ కోర్సు ముగిసిన తర్వాత బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(బీఎఫ్‌ఎస్‌ఐ)కు సంబంధించిన హైదరాబాద్‌లోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల(జీసీసీ)లో ప్లేస్‌మెంట్స్ కల్పించనున్నారు. ‘బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్లిం గ్’ పేరిట ప్రత్యేక కోర్సును స్కిల్ వర్సిటీలో అందుబాటులోకి తెచ్చారు.
రేవంత్‌రెడ్డి సంకల్పం.. శ్రీధర్‌బాబు చొరవ
పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య నెలకొన్న అంతరాన్ని తగ్గించి, తెలంగాణను నైపుణ్యం కలిగిన మానవ వనరులకు చిరునామాగా మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డి సంక్పలించారు. అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టారు. పరిశ్రమల అవసరాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ.. అందుకు అనుగుణంగా కొత్త కోర్సులను తెలంగాణ యువతకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో ఏర్పాటవుతున్న జీసీసీల సంఖ్య పెరుగుతోంది.
వీటిల్లో తెలంగాణ యువతకు ఉద్యోగాలు దక్కేలా ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇప్పించాలని మంత్రి శ్రీధర్ బాబు భావించి.. అందుకోసం బీఎస్‌ఎఫ్‌ఐలో అనుభవమున్న దేశీయ, సింగపూర్, అమెరికా కంపెనీలను సంప్రదించారు. నిపుణుల సూచనలతో ‘బీఎఫ్‌ఎస్‌ఐ- స్కిల్లింగ్’ పేరిట స్కిల్ యూనివర్సిటీలో కొత్త కోర్సు ప్రవేశపెట్టారు.




