తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల జరిగాయి. పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో వరంగల్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్పీలో చేరారు. వరంగల్ జిల్లా 43వ డివిజన్‌కు చెందిన తునికి సురేష్‌గౌడ్ ఆధ్వర్యంలో పోకల ఈశ్వర్, దూడే శ్రీనివాస్, దడిగల రవీందర్, మినుముల భాస్కర్, నారగోని శేఖర్, భాస్కర్ టీఆర్పీలో చేరారు.
అనంతరం సింగరేణి కాంట్రాక్ట్ లేబర్ పరిరక్షణ సంఘం వ్యవస్థాపకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడిపల్లి కరుణాకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బాషబోయిన రవి కుమార్.. తీన్మార్ మల్లన్నను కలిశారు. సింగరేణి కార్మికుల సమస్యలు, కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై వీరు మల్లన్నతో కలిసి చర్చించారు. అదేవిధంగా, భువనగిరిలో ‘రాజ్యాధికార సమరభేరి‘ మహాసభ ఘనవిజయంపై బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు దేవల్ల సమ్మయ్య, రాష్ట్ర అధ్యక్షులు సతీష్ కొట్టె తీన్మార్ మల్లన్నను కలిసి అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్యగౌడ్, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సంకూరి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్, బీడబ్ల్యూయూ చైర్మన్ సంపత్ ముదిరాజ్, రాష్ట్ర నాయకులు పిట్టల శంకర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు మల్లెల వీరనారాయణ, కోటేశ్వర్ రావు, మంద శ్రీను తదితరులు పాల్గొన్నారు.






