26-09-2024 12:00:00 AM
భారతీయ కుటుంబాలలో సామాజిక పరస్పర చర్య అత్యంత ప్రాధాన్యత గల అంశం. సామాజిక బంధాలు దీర్ఘకాలం కొనసాగుతాయని భారతీయులు భావిస్తున్నారు. పాశ్చాత్య సంస్కృతిలో వ్యక్తిత్వం లేని పరస్పర చర్యలతో కూడిన ఆర్థిక కార్యకలాపాలు కూడా భారతదేశంలో సామాజిక అనుబంధంలో లోతుగా ఇమిడి ఉన్నాయి.
అన్ని సామాజిక పరస్పర చర్యలో సోపానక్రమం, గౌరవం, ఇతరుల భావాలు, హక్కులు, బాధ్యతలు, ఆతిథ్యం ,ఆహారం, దుస్తులు వంటి వస్తువులపై నిరంతరం శ్రద్ధ ఉంటుంది. మర్యాదకు చెందిన నియమాలు ప్రతి వ్యక్తి సామాజిక సంబంధాలను సులభతరం చేయడంలో సహాయపడతాయి.
ప్రభుత్వం, వ్యాపారాల్లోని ముఖ్యమైన అధికారులు తమ పదవులను విడిచిపెట్టి-- చాలా రోజులపాటు--బంధువు వివాహానికి హాజరయ్యేందుకు లేదా దేశంలోని సుదూర ప్రాంతంలో మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడాన్ని చూసి భారతదేశానికి వచ్చే పాశ్చాత్య సందర్శకులు ఆశ్చర్యపోతారు.
కుటుంబ కార్యక్రమాలలో లేదా మతపరమైన, సమాజానికి కీలకమైన ఆచారాలలో బంధువులతో సామాజిక బంధాలు తప్పనిసరిగా బలపడాలి. ఇది చేయకపోతే, జీవితంలోని అనేక దశలలో కీలకమైన సహాయాన్ని అందించగల వ్యక్తులు దూరరమవుతారు.
భారతదేశంలోని సామాజిక సంబంధాలు ప్రపంచానికే ఆదర్శంగా ఉండేవి. కానీ నేడు సామాజిక సంబంధాలను ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి..ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కేవలం భారతదేశంలోనే ఉందని ప్రపంచం మొత్తం మన దేశంవైపు చూసే రోజులు పోయాయి. ఇది భవిష్యత్తులో మరింత దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా నేటి ఆధునిక యువతకు సామాజిక విలువలు, మానవ సంబంధాలు నేర్పడం, బోధించడం తప్పనిసరి.
స్త్రీలు వివాహం తర్వాత మెట్టినింట సంసారం చేసే ఆచారం లేదా సాంప్రదాయంలేదా జీవన విధానం బలంగా కొనసాగుతున్న భారతదేశంలో బంధు వర్గంలోనూ, బాధ్యతల విషయంలోనూ , ప్రేమానురాగాలను పంచే సందర్భంలోనూ అనేక కలతలు, కయ్యాలు వివాదాలతో కుటుంబ బంధాలు విచ్ఛిన్నమవుతున్న సందర్భాలను ఎక్కువగా గమనించవచ్చు.
సయోధ్య లేక , బాధ్యతను గుర్తించక ,తోటి మనిషిని సాటి మనిషిగా చూసే ప్రేమానురాగాలకు నోచుకోక, మొక్కుబడి జీవితాన్ని కొనసాగించే బాధ్యత లేని వారి ఇండ్లలో ఇలాంటి కయ్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి.
ప్రాథమికంగా చూసినప్పుడు తల్లిదండ్రుల వారసత్వం నుండి సంక్రమించినటువంటి ఆస్తిపాస్తుల మాదిరిగానే బంధువర్గం కూడా మన కుటుంబంతోపెనవేసుకొని ఉంటుంది. వాళ్లందర్నీ భార్యాభర్తలు ఇరువురూ సమాన ప్రేమతో, ఆత్మీయతతో బాధ్యతాయుతంగా పలకరించడంతోపాటు ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించవలసి ఉంటుంది.
ఇక ఇరుపక్షాలకు సంబంధించిన తల్లిదండ్రులు, వారి పిల్లలు కుటుంబానికి ప్రాధాన్యత కలిగిన వారే అనడంలో సందేహం లేదు. ఇంటికి వచ్చిన ప్రతి వాళ్లను కూడా ఆదరించి బాధ్యతలు నిర్వహించవలసిన సందర్భంలో వివక్షత ఇబ్బందికరంగా ఉంటుంది .
మనకు మనమే ప్రక్షాళన చేసుకుని కొంతవరకైనా ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నించడం ద్వారా ఈ దుర్వ్యవస్థ నుండి బయటపడవచ్చు.మూర్ఖపు ఆలోచనలతో, స్వార్థ నిర్ణయాలతో, క్షణికావేశంలో తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు, వివక్షత రెండు వర్గాలుగా కుటుంబ బంధువులను విడదీయడడానికి భార్య లేదా భర్త ఎవరు యత్నించినా ప్రమాదమే.
దాని ప్రభావం పిల్లలపైన, వారసులపైన పడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి న్యాయబద్ధంగా పోవడం, భార్యాభర్తలిద్దరూ సమన్వయంతో కలిసిపోవడం, కుటుంబ బంధువులందరినీ సమానంగా చూసే సంప్రదాయాన్ని గౌరవించడం ద్వారా బంధువుల మధ్య వివక్షతను అంతం చేయాలి. ఆ పేరుతో భార్యాభర్తల ఘర్షణలకు ముగింపు పలకాలి.
డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి