calender_icon.png 1 February, 2026 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతికి సంధానకర్తగా భారత్!

26-09-2024 12:00:00 AM

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి :

నేడు ప్రపంచ శాంతికి విఘాతంగా యుద్ధాలు నిలుస్తున్నాయి. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఉక్రెయిన్ -- రష్యా యుద్ధం సుదీర్ఘకాలం పాటు భీకరంగా కొనసాగుతున్నది.  2023 అక్టోబర్‌లో ప్రారంభమైన ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధం ఏడాది కాలంగా ప్రమాదకర మారణహోమ స్థాయిలో జరుగుతున్నది.

దీనికి తోడుగా ఇజ్రాయెల్‌తో ఇరాన్, లెబనాన్‌లకు వైరం దినదినం తీవ్రరూపం దాల్చుతున్నది. వీటి ఫలితంగా ఇప్పటికే వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అనేక పట్టణాలు మరుభూములుగా మారుతున్నాయి.  ఈ యుద్ధాలతో ప్రపంచ శాంతి పావురాలు గజగజ వణుకుతున్నాయి. యుద్ధ ముగింపు దారులు కనిపించడం లేదు.

కాల్పుల విరమణకు ఏ దేశమూ అంగీకరించడం లేదు. ఇలాంటి ప్రమాదకర సంధికాలంలో యుద్ధాల ముగింపునకు మధ్యవర్తిత్వం చేయడానికి ప్రముఖ దేశాలు చొరవ చూపడం అత్యవసరంగా తోస్తున్నది.  యుద్ధాలను ఆపడానికి లేదా కాల్పుల విరమణ పాటిస్తూ చర్చలు కొనసాగించడానికి భారత్, చైనా, అమెరికా లాంటి ప్రధాన దేశాలు చొరవ చూపాల్సిన సమయం ఆసన్నమైనది. 

భారత్ పెద్దన్న పాత్ర పోషించగలదా?

ఐక్యరాజ్య సమితి (ఐరాస) 79వ సర్వసభ్య సమావేశాల నేపథ్యంలో స్లోవాకియా దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినీ మాట్లాడుతూ ఉక్రెయిన్--రష్యా యుద్ధం ఆపడానికి సంధానకర్తలుగా పెద్దన్న పాత్ర పోషిస్తూ శాంతియుత వాతావరణంలో చర్చలు జరపడానికి భారత్, చైనా, అమెరికా లాంటి ప్రధాన దేశాలు ముందుకు రావాలని కోరడం జరిగింది.

రష్యాతో పాటు ఉక్రెయిన్‌తో సత్సంబంధాలను కొనసాగిస్తున్న భారతదేశం యుద్ధ ముగింపునకు చొరవ చూపితే సత్ఫలితాలు రావచ్చని కూడా ఆయన అభిప్రాయ పడడం విశేషం. మెజారిటీ దేశాల అభిమతంగా నిలిచిన భారత్‌కు ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వడం కూడా ఈ సందిగ్ధ సమయంలో సముచితంగా ఉంటుందని, ఆ స్థితిలో భారత్ మరింత ఉత్సాహంగా మధ్యవర్తిత్వం జరిపే అవకాశం ఉందని కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం ముదావహం.

ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని మాట్లాడుతూ భారత్, చైనాలు మాత్రమే ఉక్రెయిన్- - రష్యా యుద్ధ అంతానికి సంధానకర్తలుగా చొరవ చూపాలని అనడం కూడా విశేషం. 2024 నవంబర్‌లో భారత్ నేతృత్వంలో శాంతి సమావేశం (పీస్ సమ్మిట్)’ ఏర్పాటు కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రతిపాదించడం, రష్యా పాల్గొనకుండా శాంతి సమావేశం విఫల ప్రయత్నం అవుతుందని ఇండియా భావించడం గమనార్హం.

అయితే ఎన్నో అంతర్జాతీయ నేరాలకు పాల్పడుతున్న పుతిన్ తనంతట తానుగా ఆగరని, ఆయనను బలవంతంగా శాంతి చర్చలకు ఒప్పించాల్సిన అవసరం ఉందని ఐరాసలో మాట్లాడుతూ జెలెన్‌స్కీ వ్యాఖ్యానించడం గమనార్హం.

రష్యా యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటే ఏం చేయాలో అందరికీ తెలుసునని, అయితే దానికి కావల్సింది సంకలపం మాత్రమేనని ఆయన అంటూ, ఇందుకోసం యూఎన్ చాప్టర్‌ను గౌరవించే అన్ని దేశాలను శాంతి సదస్సుకు ఆహ్వానించామని అన్నారు.  అయితే ఏదో ఒక రోజు యుద్ధం ముగిసిందని ఇదే హాలులో మాట్లాడుకుంటామన్న ఆశాభావాన్ని సైతం జెలెన్‌స్కీ వ్యక్తం చేయడం విశేషం.

 రష్యా,-ఉక్రెయిన్‌లతో సత్సంబంధాలు

భారత విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ ఇటీవల బెర్లిన్ నగరంలో మాట్లాడుతూ ఉక్రెయిన్- - రష్యా యుద్ధానికి రెండు దేశాలు చరమగీతం పాడడానికి భారత్ కొన్ని నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాలు కోరుకుంటేనే భారత్ సంధానకర్తగా నిలబడి శాంతియుత వాతావరణంలో చర్చలు కొనసాగించి ఒక చక్కటి పరిష్కారం చూపగలదని స్పష్టం చేశారు.

ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ  విదేశీ పర్యటనలో రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులు పుతిన్, జెలెనెస్కీలను కలిసి వేర్వేరుగా కొన్ని ప్రతిపాదనలు కూడా చేసినట్లు తెలుస్తున్నది. మోదీ పర్యటన నేపథ్యంలో పుతిన్ మాట్లాడుతూ యుద్ధ విరమణకు మధ్యవర్తిత్వం చేయడానికి ఇండియా, చైనా, బ్రెజిల్ దేశాలు స్పందించాలని స్పష్టంగా కోరారు.

భారతదేశం రష్యాతో సత్సంబంధాలను కొనసాగిస్తూ చమురును దిగుమతి చేసుకుంటున్నది. అలాగే ఉక్రెయిన్‌కు మానవీయ చేయూతనిస్తూ రెండు దేశాలతో మంచి దౌత్య సంబంధాలను కొనసాగిస్తున్నది. రష్యాతో సత్సంబంధాలను కొనసాగించే విషయంలో భారత దౌత్యనీతిని అమెరికా వ్యతిరేకిస్తున్నది.

తన రష్యా, ఉక్రెయిన్ పర్యటన విశేషాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోకూడా ఇటీవలి అమెరికా పర్యటనలో మోదీ పంచుకున్నట్లు తాజా సమాచారం. బంగ్లాదేశ్‌లో జరిగిన పౌరుల తిరుగుబాటు వెనుక అమెరికా హస్తం ఉందన్న రష్యా వాదనను కూడా భారత్ వ్యతిరేకించడం గమనార్హం. 

పాలస్తీనా యుద్ధ ముగింపునకు మధ్యవర్తిత్వం

 ఇజ్రాయిల్- - పాలస్తీనా యుద్ధ అంతానికి, పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు ఇండియా మాత్రమే సరైన దేశమని మన దేశంలో ఇజ్రాయెల్ రాయబారి పేర్కొనడం గమనించదగ్గ అంశం. ఇటీవల సాధారణ ఎన్నికల్లో తిరిగి ప్రధానిగా మోదీ ఎన్నికైన సందర్భంగా పాలస్తీనా ప్రధానమంత్రి మహమ్మద్ ముస్తాఫా మాట్లాడుతూ నరేంద్ర మోదీ లాంటి అగ్ర నేతలు మాత్రమే గాజా మారహోమాన్ని ఆపగలరని అన్నారు.

2024 ఆగస్టులో  ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడిన మోదీ యుద్ధ ముగింపుకు తొలి అడుగుగా ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాలని కోరారు. ఎర్రసముద్రంలో చమురు రవాణాను ప్రతిఘటిస్తున్న యెమెన్‌కు చెందిన హౌతీస్ చర్యలను అడ్డుకోవడానికి భారత ప్రధాని మోదీ సరైన వ్యక్తి అని, ఈ చొరవతో పలు దేశాల చమురు రవాణాలకు మార్గం సుగమం అవుతుందని యూరోపియన్ నాయకులు అనడం ఈ సందర్భంగా గమనార్హం.

ప్రపంచ యవనికపై పెరిగిన ప్రతిష్ఠ

ప్రపంచ దేశాల్లో భారత్‌కు ఇప్పుడు సముచిత గౌరవం లభిస్తున్నది. భారతదేశం సదా శాంతిని కోరుకుంటూ, చర్చల ద్వారా సమస్యల పరిష్కారాలకు ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రపంచ దేశాలతో భారత సంబంధాలు అలీన ఉద్యమ విధానాలతో ముందుకు సాగుతున్నాయి. కరోనా విపత్తులో మానవీయతను ప్రదర్శిస్తూ వందల దేశాలకు టీకాలను అందించింది.

ప్రకృతి విపత్తు సంక్షోభాల్లో నలుగుతున్న దేశాలకు భారత్ మానవీయ కోణంలో సదా ఆపన్నహస్తం అందిస్తున్నది. భారతదేశ అడుగులు, ఆలోచనలు ప్రపంచ శాంతి దీపానికి చమురుగా పని చేస్తున్నాయి. ఇండియా అభిప్రాయాలకు ప్రపంచ మానవాళి సమున్నత విలువలను ఇస్తున్నది.  అయితే ఆధునిక ఆయుధాలు, రక్షణ సామాగ్రి వ్యాపారాలకు యుద్ధాలు ఉపయోగపడుతున్నాయని కూడా కొన్ని దేశాలు భావించడం విచారకరం, ఆక్షేపణీయం. 

యుద్ధ పరిష్కారం అనుకున్నంత సులువు కాదు. దానికి మధ్యవర్తిత్వం ద్వారా సమాధానం వెతకడానికి చర్చల అడుగులు నెమ్మదిగానైనా పడాల్సిన అవసరం ఉంది. యుద్ధం ముగింపునకు తొలి అడుగు కాల్పుల విరమణ అని గ్రహించాలి. నేడు భీకరంగా కొనసాగుతున్న రెండు యుద్ధాలకు చరమగీతం పాడడానికి భారత్‌తో పాటు మరి కొన్ని దేశాలు కూడా చొరవ చూపాలి.

పలు దేశాలు ఒత్తిడిని పెంచితేనే యుద్ధం చేస్తున్న దేశాలు పునరాలోచనలో పడి, చర్చలకు తలుపులు తెరుస్తాయి. ప్రపంచ దేశాలపై ప్రతికూల ప్రభావం పడుతున్న యుద్ధాలను ముగించడానికి భారత్, చైనా, అమెరికాలాంటి ప్రముఖ దేశాలు కంకణబద్దులు కావాలి. పశ్చిమాసియాలో శాంతికి ఇప్పటిక తలుపులు మూసుకు పోలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గమనార్హం. యుద్ధాలు లేని శాంతియుత ప్రపంచాన్ని శ్వాసించాలి. 

 వ్యాసకర్త సెల్: 9949700037