calender_icon.png 1 February, 2026 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ ఆరోగ్యమే శ్రీరామరక్ష

26-09-2024 12:00:00 AM

 నేడు ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం :

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాల ప్రకారం ప్రపంచంలో 24శాతం మరణాలు పర్యావరణ సంబంధిత కారణాల వల్ల జరుగుతున్నాయి, అంటే సంవత్సరానికి కోటీ 37 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. పర్యావరణం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, వ్యాధుల భారాన్ని దాదాపు నాలుగింట ఒక భాగం తగ్గించవచ్చని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.

ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు వారి పరిసరాల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మన చుట్టూ ఉన్న పర్యావరణం, నివసించే స్థలం, ఆహారం, గాలి ఇవన్నీ మన ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపిస్తాయి. ఆరోగ్యకరమైన పర్యావరణం జీవన నాణ్యతను మెరుగుపరచడానికి అత్యంత అవసరం. పర్యావరణ ఆరోగ్యం అనేది ప్రజారోగ్యంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది మానవులు, వారి పర్యావరణం మధ్య ఉన్న సంబంధాలను విశ్లేషిస్తుంది.

ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం ప్రతి ఏటా సెప్టెంబర్ 26న జరుపుకుంటారు. ఈ రోజున మానవ ఆరోగ్యం , పర్యావరణం మధ్య ఉన్న సంబంధాన్ని, ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అంతర్జాతీయ పర్యావరణ ఆరోగ్య సమాఖ్య (ఐఎఫ్‌ఈహెచ్) 2011లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది, అప్పటి నుండి ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది..

ఐఎఫ్‌ఈహెచ్ అనేది 44 సభ్యులతో  కూడిన సంస్థ. పర్యావరణ ఆరోగ్యంపై అవగాహన పెంచడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నది. ఇది 100కి పైగా దేశాలలో పర్యావరణ ఆరోగ్య నిపుణులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రపంచ సంస్థ. మానవులు, పర్యావరణం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి, పర్యావరణ పరిరక్షణ చర్యల గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఈ సందర్భంగా, పర్యావరణ కాలుష్యం, ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రమైన ఆహారం అందుబాటులో ఉంచడం, వాతావరణ మార్పు వంటి ముఖ్యమైన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలనే సంకల్పాన్ని ప్రజలకు గుర్తుచేయడం జరుగుతుంది.

2024 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం  థీమ్ ‘ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఆరోగ్యకరమైన పర్యావరణాలు’. ఈ థీమ్, రాబోయే తరాల కోసం సుస్థిరమైన,ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్ధారించడానికి పర్యావరణాన్ని రక్షించడం ఎంత ముఖ్యం అనే విషయంపై దృష్టి సారిస్తుంది.

పర్యావరణ ఆరోగ్య కార్యకర్తల పనులను దిశానిర్దేశం చేసి, ప్రజలను పర్యావరణ పరిరక్షణలో సహకరించేందుకు, భాగస్వామ్యులను చేసేందుకు ప్రోత్సహించడం ఈ దినోత్సవం లక్ష్యం. మన ఆరోగ్యానికి, భవిష్యత్తుకు సంబంధించి, తక్షణ చర్యలు తీసుకోవడం అత్యంత కీలకం.

కాలుష్యం, వాతావరణ మార్పు, పారిశ్రామికీకరణ, ఇతర సవాళ్లను ఎదుర్కొనడంలో పర్యావరణ ఆరోగ్య నిపుణులు, విద్యావేత్తల కృషి అవసరం. ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం, ప్రజలకు అవగాహన కల్పించడం , చైతన్యం పెంచడం ద్వారా కమ్యూనిటీల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రభుత్వాల బాధ్యత ఎంత ఉందో, ప్రతి మనిషి బాధ్యత కూడా అంతే ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించగలిగితే పర్యావరణ ఆరోగ్యాన్ని మనం కాపాడుకొన్నట్లే. పరిశుభ్రత, పచ్చదనంతో కూడిన ఆరోగ్యవంతమైన పర్యావరణ సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు పునరంకితం కావాలి.

పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అందుకు ప్రతి ఒక్కరూ తమ పాత్రను సక్రమంగా నిర్వర్తించాలని ప్రోత్సహించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం. 

 డా.కృష్ణకుమార్ వేపకొమ్మ