20 June, 2026 | 6:32 PM

Breaking News

సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •   ఆస్పత్రి సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం   •   కనగర్తిలో ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులు   •   ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత సమస్య పరిష్కరించాలి   •  

ఫారెస్ట్–రెవెన్యూ జాయింట్ సర్వే, భూసేకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలి

20-06-2026 05:26 PM

అక్కినేపల్లి, లింగంపల్లి ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించిన జిల్లా కలెక్టర్ అంకిత్

దమ్మపేట,(విజయక్రాంతి): జిల్లాలో ఫారెస్ట్–రెవెన్యూ జాయింట్ సర్వే, నాన్-క్యాడస్ట్రల్ సర్వే, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శనివారం దమ్మపేట మండలంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా దమ్మపేట మండలం అక్కినేపల్లి గ్రామంలో చేపడుతున్న నాన్-క్యాడస్ట్రల్ సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. సర్వే ప్రక్రియ, భూముల హద్దుల గుర్తింపు, రికార్డుల నమోదు విధానాలను అడిగి తెలుసుకుని పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు. అనంతరం దమ్మపేట మండలం లింగంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 1458లో కొనసాగుతున్న ఫారెస్ట్–రెవెన్యూ జాయింట్ సర్వే పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు.

అటవీ ,రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను పరిశీలించి, భూముల సరిహద్దుల నిర్ధారణలో ఖచ్చితత్వం పాటించాలని ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్‌కు వివరాలు అందిస్తూ అక్కినేపల్లి గ్రామ పరిధిలో సుమారు 4,400 ఎకరాల విస్తీర్ణంలో ఫారెస్ట్–రెవెన్యూ జాయింట్ సర్వే పనులు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం పనులు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయని తెలిపారు. మరో రెండు నెలల్లో సర్వే ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు వివరించారు.

దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీతారామ ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను మ్యాప్ ద్వారా పరిశీలించి, ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, సర్వే, సరిహద్దుల నిర్ధారణ అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ప్రాజెక్టు పనులకు ఎటువంటి అవరోధాలు తలెత్తకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ఫారెస్ట్–రెవెన్యూ జాయింట్ సర్వే ద్వారా అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దులు స్పష్టంగా నిర్ధారణ కావడంతో పాటు భవిష్యత్తులో తలెత్తే వివాదాలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. సర్వే, భూసేకరణ ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రభుత్వ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి మధు, దమ్మపేట తాసిల్దార్ రామ్ నరేష్, ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ రావు,సర్వేయర్ నాగరాజు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు