27 August, 2026 | 12:37 PM

విజయక్రాంతి ఎఫెక్ట్‌: నెట్టంపాడు పూర్తి చేస్తాం

27-08-2026 08:54 AM

 రైతుల సాగునీటి సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి 

మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ 

ఇటిక్యాల : నెట్టంపాడు ప్రాజెక్టు(Nettampadu project) పెండింగ్‌ పనులను పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత డాక్టర్‌ ఎస్‌.ఏ. సంపత్‌కుమార్‌( Former MLA Sampath Kumar) అన్నారు. నెట్టంపాడు కాలువలపై పాలకుల నిర్లక్ష్యం, చివరి ఆయకట్టుకు సాగునీరు ఎప్పుడంటూ ఈ నెల 23న ‘ విజయక్రాంతి’ లో ప్రచురితమైన ‘గద్దెనెక్కడానికి హామీలు.. గెలిచాక కన్నీళ్లు’ కథనానికి ఆయన స్పందించారు. బుధవారం కంచుపాడులో నిర్వహించిన సురవరం సుధాకర్‌రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నెట్టంపాడు ప్రాజెక్టు ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలపై సంపత్‌కుమార్‌ మాట్లాడారు. నెట్టంపాడు ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రారంభమైందని, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. అనంతరం వచ్చిన ప్రభుత్వం పదేళ్ల పాటు మిగిలిన పనులను పూర్తి చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదని పేర్కొన్నారు.

ఆర్డీఎస్‌ సమస్యను కూడా పరిష్కరించాలి 

నెట్టంపాడు ప్రాజెక్టుతో పాటు ఆర్డీఎస్‌ నీటి సమస్యను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందని సంపత్‌కుమార్‌ అన్నారు. పెండింగ్‌ పనులు, కాలువల నిర్మాణాన్ని పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలను నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు జిల్లా కలెక్టర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు.

రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నెట్టంపాడు ప్రాజెక్టు మిగిలిన పనులను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని సంపత్‌కుమార్‌ అన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు కాలువల్లో నీరు పారించి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు. రైతు పొలాల్లో పచ్చని పంటలు పండేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ‘ విజయక్రాంతి ’ కథనం ద్వారా రైతుల సమస్య మరోసారి వెలుగులోకి వచ్చిందని, ప్రభుత్వం కూడా సమస్యపై దృష్టి సారించి పెండింగ్‌ పనులను వేగంగా పూర్తి చేయాలని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.