మురుగునీటి శుద్ధి ప్లాంట్‌పై ఉమ్మడి తనిఖీ
సీఎంసీ కమిషనర్ శ్రీజన, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
రామచంద్రపురం, జూలై 3: రామచంద్రపురం మండలం తెల్లాపూర్ డివిజన్ పరిధిలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.శ్రీజన, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (జలమండ:లి) మేనేజింగ్ డైరెక్టర్ కె.అశోక్ రెడ్డిలు కలిసి కొల్లూరు చెరువు డబుల్ బెడ్ రూమ్ ప్రాంతంలో మురుగునీటి శుద్ధి ప్లాంట్ను ఉమ్మడిగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా చెరువులోకి మురుగు నీరు కలిసే సమస్యలు, కాలుష్య నియంత్రణ చర్యలు, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణ పురోగతి సంబంధిత అంశాలపై వివరంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ శ్రీజన మాట్లాడుతూ చెరువు కాలుష్య సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచాలని, అన్ని సంబంధిత విభాగాలు సమన్వయంతో పని చేసి తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కూడా టెక్నికల్ అంశాలపై సూచనలు చేశారు. కొల్లూరు చెరువు ప్రాంతంలోని కాలుష్యం స్థానిక ప్రజల ఆరోగ్యం, పర్యావరణానికి ముప్పుగా మారుతోంది. ఈ తనిఖీ ద్వారా సమస్యల పరిష్కారానికి త్వరిత చర్యలు జరుగుతాయని స్థానికులు ఆశిస్తున్నారు. ఈ తనిఖీలో సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, అధికారులు పాల్గొన్నారు.






