ఉమ్మడిగానా.. విడివిడిగానా?
4,486 కోట్ల పనులకు టెండర్‌పై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వానికి జీహెచ్‌ఎంసీ లేఖ
కార్పొరేషన్ల విభజనతో మారిన సమీకరణలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 21 (విజయక్రాంతి): నగరంలోని ప్రధాన రహదారులు, వీధి దీపాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారీ ప్రాజెక్టులు ఇప్పుడు టెండర్ల ప్రక్రి యలో చిక్కుకున్నాయి. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మౌలిక వసతుల పర్యవేక్ష ణను పదేళ్ల పాటు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణ యించినప్పటికీ, ఆ టెండర్లు అసలు ఎలా పిలవాలనే అంశంపై అధికారుల్లో తీవ్ర సందిగ్ధత నెలకొంది.
జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి విభజించిన నేపథ్యంలో, టెండ ర్లు ఉమ్మడిగా వేయాలా లేక కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ల వారీగా విడివిడిగా పిలవా లా అనే దానిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ యంత్రాంగం ప్రభుత్వానికి వివరణాత్మక లేఖ రాసింది. ప్రధాన రహదారుల శాశ్వత నిర్వహణ కోసం కాంప్రహె న్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్ సీఆర్‌ఎంపీ రెండో విడతను ప్రభుత్వం ఎంతో భరోసాతో తీసుకువచ్చింది.
దీని కింద రూ.3,145 కోట్ల భారీ వ్యయంతో 1,045 కిలోమీటర్ల మేర రోడ్లను పదేళ్ల పాటు ఏజెన్సీలకు అప్పగించాలని లక్ష్యంగా పెట్టుకు న్నారు. అదేవిధంగా, క్యూర్ పరిధిలోకి వచ్చే లక్షలాది వీధి దీపాల నిర్వహణ కోసం మరో రూ.1,341 కోట్లతో పదేళ్ల సుదీర్ఘ ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొ త్తంగా రూ.4,486 కోట్ల విలువైన ఈ రెండు పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు లభించినప్పటికీ, టెండర్ల రూపకల్పన దశలోనే ఫైళ్లు ఆగిపోయాయి.
గతంలో జీహెచ్‌ఎంసీ ఒక్కటే ఉండటం తో ఇటువంటి మెగా టెండర్ల ప్రక్రియ సులభంగా ముగిసేది. కానీ, ఇప్పుడు నగర విస్తర ణ, విభజన నేపథ్యంలో సమీకరణలు పూర్తి గా మారిపోయాయి. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ కమిషనర్ నేతృత్వంలోనే మొత్తం క్యూర్ పరిధికి కలిపి ఒకే మెగా టెండర్ పిలవాలా.. లేక సైబరాబాద్, మల్కాజిగిరి.
కార్పొరేషన్లకు సంబంధించి వారు స్వయంగా తమ పరిధిలో టెండర్లు వేసుకోవాలా.. అనే విషయంలో క్షేత్రస్థాయి అధికారుల్లో గందరగో ళం నెలకొంది. ఒకవేళ విడివిడిగా టెండర్లు పిలిస్తే ఏజెన్సీల ఎంపికలో జాప్యం జరుగుతుందని, పనుల నాణ్యతలో తేడాలు వస్తా యని కొందరు భావిస్తుండగా.. ఉమ్మడిగా పిలిస్తే పరిపాలనా పరంగా కొత్త కార్పొరేషన్ల స్వయంప్రతిపత్తికి ఇబ్బందులు తలెత్తుతాయని మరికొందరు వాదిస్తున్నారు.
ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కోరు తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖకు బల్దియా ఉన్నతాధికారులు లేఖ రాశారు. టెండర్ల విధివిధానాలపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తే తప్ప తాము ముందుకు వెళ్లలేమని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ వారం రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.




