అసంపూర్ణంగా ముగిసిన జూనియర్ డాక్టర్ల చర్చలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సోమవారం నిరవధిక సమ్మె చేసున్నారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. దీంతో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ్మ జూనియర్ డాక్టర్లతో మినిస్టర్ క్వార్టర్స్ లో చర్చలు జరిపారు. ఈ చర్చలకు ఉస్మానియా, గాంధీ దవాఖానల జూనియర్ డాక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ..ఆరోగ్య శాఖ మంత్రితో జరిగిన చర్చలు అసంపూర్ణంగా ముగిశాయని తెలిపారు. కొన్ని అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారని, మరికొన్ని అంశాలపై మరోసారి చర్చించాలని చెప్పినట్లు జూడాలు వెల్లడించారు. ఆయా అంశాలపై ప్రపోజల్స్ ఉన్నతాధికారులకు మంత్రి పంపించారని తెలిపారు. వైద్యుల భద్రత గురించి ఆరోగ్య శాఖ మంత్రి ఆలోచిస్తామని, స్టైఫండ్ కు గ్రీన్ ఛానల్ పై మరోసారి చర్చించి నిర్ణయిస్తామన్నట్లు జూడాలు చెప్పారు. కొత్త వైద్య కళాశాలలకు బస్ ఏర్పాట్లపై డీఎంఈ నిర్ణయం తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి సమ్మె యధాతథంగా కొసాగుతుందని జూనియర్ డాక్టర్లు వెల్లడించారు. ఈ సమ్మెలో దాదాపు 4 వేల మంది పాల్గోన్నట్లు వారు పేర్కొన్నారు.






