3 May, 2026 | 9:47 PM

రాహుల్ గాంధీతోనే బీసీలకు న్యాయం

27-04-2024 02:41 AM

l పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు 

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి):  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి అయితేనే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు అన్నారు. యువతకు ఉద్యోగాలకు రావాలన్నా, ఉద్యోగులకు ప్రమోషన్లు కావాలన్నా ప్రతిఒక్కరు కాంగ్రెస్‌కు ఓటు వేసి.. రాహుల్‌ను ప్రధాని చేయాలని ఆయన కోరారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. దేశంలో బీసీలు ఎక్కువగా ఉన్నారని, కానీ పదేళ్లుగా అధికారంలో ఉండి  బీసీ ప్రధానిగా చెప్పుకొంటూ ప్రధాని మోదీ బీసీలకు న్యాయం చేయలేదని విమర్శించారు. మోదీకి ఓటు వేస్తే ఆదానీ, అంబానీలకు ఓటు వేసినట్లేనన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయించే బాధ్యతను బీసీలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఖమ్మం ఎంపీ టికెట్ తనకు ఇవ్వకున్నా తాను పార్టీలోనే ఉంటానని, చచ్చేంత వరకు కాంగ్రెస్ కొనసాగుతానని స్పష్టం చేశారు.