ఇసుక దందా.. ఆపేదుందా?

27-04-2024 02:43:52 AM

గోదావరి, మానేరు తీరాల నుంచి యథేచ్ఛగా రవాణా

రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా తరలింపు

ట్రక్కుకు రూ.3 వేల నుంచి రూ.4 వరకు వసూలు

‘మామూలు’గా తీసుకుంటున్న పోలీసులు, అధికారులు


మంథని, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. అక్రమంగా ఇసుక తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీ గా గండి కొడుతున్నది. మంథని మండలంలోని గుంజపడుగు గోదావరి తీరం, ముత్తారం మండలంలోని మానేరు పరీవాహక గ్రామాలైన ముత్తారం, ఖమ్మంపల్లి, పారుపల్లి, ఓడేడు గ్రామాల్లో ఇసుక దందా మూడు పూవులు ఆరు కాయలుగా సాగుతున్నది. అక్రమార్కులు రాత్రీ పగలు అనే తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తున్నారు. మంథని పట్టణం నుంచి రామగిరి మండలంలోని బేగంపేట, సెంటీనరీ కాలనీ, కల్వచర్ల, పన్నూరు, కమాన్‌పూర్ మండలాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఒక్క ట్రక్కు ఇసుకకు సుమారు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు ఇసుకను హైదారబాద్‌కు సైతం తరలిస్తున్నట్లు గ్రామస్తులు వెల్లడిస్తున్నారు.

నిబంధనలకు పాతర..

ఇసుక మాఫియా నిబంధనలకు విరుద్ధంగా రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా ఇసుక తరలిస్తున్నది. వాస్తవానికి జిల్లాస్థాయి సాండ్ కమిటీ డీఎల్‌ఎస్‌ఈ దరఖాస్తు చేసుకున్న తర్వాత వ్యవసాయ, గనులు, మైనింగ్, రెవెన్యూ శాఖలు క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసి, అన్నీ అనుకూలంగా ఉంటే ఇసుక తవ్వకాలకు అనుమతులు వస్తాయి. కానీ మంథని నియోజకవర్గంలో అలా జరగడం లేదు. ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి మానేరు తీరం నుంచి అక్రమార్కులు వారం నుంచి ప్రతిరోజూ వందల ట్రక్కుల ఇసుకను తవ్వుతున్నారు. నది ఒడ్డున పొలాల్లో డంప్ చేస్తున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఇసుక డంప్ అవుతున్నా రెవెన్యూ అధికారులు, పోలీసులు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కొందరు అధికారులు ‘మామూళ్ల’ మత్తులో జోగడంతోనే ఈ పరిస్థితి దాపురించందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎవరై నా ఇసుక రవాణా చేస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే ఒకటీ అర వాహనాలను పట్టుకోవడం, ఆ తర్వాత వదిలిపెట్టడం సర్వసాధారణంగా జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రపు చర్యలు తప్ప ఇసుక దందా ను అరికట్టలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టాస్క్‌ఫోర్స్ దాడులు..

ఇసుక రవాణాపై ఇటీవల గ్రామస్తులు రామగుండం ట్రాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండు రోజుల నుంచి టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వరుసగా దాడులు ప్రారంభించారు. ఇప్పటికే సుమారు 60  ట్రక్కుల ఇసుకను స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. సీతంపేటలో ఇటీవల అక్రమంగా ఇసుకను లారీలో రవాణా చేస్తుండగా గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు రంగంలోకి దిగి లారీని పట్టుకున్నారు. ఖమ్మంపల్లి, ముత్తారం, ఓడే డు, పారుపల్లి నదీ తీరాల్లోనే దాడులు చేసి ఇసుక డంప్‌లను స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నామమాత్రపు కేసులు, చిన్నపాటి జరిమానా విధించకుండా, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటూ ఇసుక దందాకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నారు.