కళామతల్లి ఎల్లమ్మ
ఆమె గజ్జె కడితే ప్రేక్షకుల గుండెల్లో ఉద్వేగ ఉత్తుంగ తరంగాలు ఉవ్వెత్తున పొంగుతాయి.. ఆమె వేశం కడితే కాలం కూడా నిశ్చలంగా నిలబడి మైమరచి పరవశిస్తుంది. ఆమె గాణానికి గంధర్వులు సైతం అచ్చెరువొందుతారు. ఏ వేశం కట్టినా అందులో ఆమె అసలు కనిపించదు.. ఆ పాత్రలే కనిపిస్తాయి. ఆమే చిందు ఎల్లమ్మ.. కళనే ఇంటిపేరుగా, పాత్రనే ఒంటిపేరుగా మార్చుకొన్న చిందు ఎల్లమ్మ తెలంగాణలోని అతి ప్రాచీన కళారూపానికి చుక్కానిగా నిలిచారు. కళలో పుట్టి, కళలో పెరిగి, కళలోనే ఐక్యమయ్యారు. ఆమెను చేరని పురస్కారం లేదు. ఆమెను సత్కరించి తరించని వేదిక లేదు.
చిందు భాగవతం అనగానే టక్కున గుర్తుకొచ్చే పేరు చిందు ఎల్లమ్మ. ఆమె అసలు పేరు సరస్వతి. తాను జీవిత పర్యంతం ప్రేమించి, పోషించి, తరించిన ఎల్లమ్మ తల్లి పేరునే తన పేరుగా మార్చుకొన్న చరితార్ధురాలు చిందు ఎల్లమ్మ. తాను అభినయించిన ఎల్లమ్మ పాత్రని సొంత పేరుగా చేసుకొని జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందా రు. చిందు భాగవతంలో ప్రధాన పాత్రలు పోషించిన ఎల్లమ్మ చిందు భాగవత యక్షగాన సంప్రదాయాన్ని దశాబ్దాలుగా పదిలపరిచి ముందు తరాలకు అందించారు.
ఎల్లమ్మ జీవితపై గడ్డం మోహన్‌రావు 2013లో ’చిందు ఎల్లమ్మ’ అనే పుస్తకాన్ని రాశారు. ఆదిలాబాద్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి పాదాలచెంత ప్రభవించిన ఎల్లమ్మ.. బుడిబుడి నడకతోనే కళను కూడా అవపోసన పట్టింది. ఎల్లమ్మ 1914, ఏప్రిల్ 1న పిల్లిట్ల నభిసాజ్, ఎల్లవ్వ దంపతులకు బాసరలో జన్మించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అమ్లా పూర్ గ్రామంలో స్థిరపడ్డారు.
కుటుంబాన్ని త్యజించి.. కళలోనే జీవించి
ఎల్లమ్మకు 14 సంవత్సరాల వయస్సులోనే వివాహం జరిగింది. కానీ చిందు కళకే అంకితం కావాలనే ధ్యేయం తో వైవాహిక జీవితానికి ఆమె స్వస్తి పలికింది. తన వల్ల భర్త నష్ట పోకూడదనే ఉద్దేశంతో స్వయంగా చెల్లెలు రావమ్మను ఇచ్చి తన భర్తకు వివాహం చేసింది. నాలుగు సంవత్సరాల వయసులోనే కళారంగంలోకి ప్రవేశించిన ఎల్లమ్మ.. తల్లిదండ్రులతో కలిసి ఊరూరా తిరిగి చిందు కళాబృందాలతో ప్రదర్శనలు ఇచ్చేవారు.
చిన్నతనంలోనే రంభ వంటి వేషాలు కట్టి అందరినీ ఆకట్టుకునేది. ప్రభావతీ విలాసం, సుందరాకాండ, చెంచులక్ష్మి, సుగ్రీవ విజయం తదితర కథలను ఎల్లమ్మ జానపద నృత్యరూపంలో ప్రదర్శించేది. సత్యభామ, మోహిని, సత్యవతి, సావిత్రి, చెంచులక్ష్మిలాంటి స్త్రీ పాత్రలతోపాటు అర్జునుడు, నరసింహుడు, వాలి, శంకరుడు వంటి పురుష పాత్రలు కూడా అవలీలగా పోషించేవారు.
గల్లీ నుంచి ఢిల్లీ దాకా
ఊరి కూడళ్లలో, గల్లీల్లో మొదలైన ఎల్లమ్మ ప్రదర్శన.. క్రమంగా దేశ రాజధాని ఢిల్లీదాకా పాకింది. ఆమె ప్రదర్శనకు నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీయే ముగ్ధురా లయ్యారంటే ఎల్లమ్మ తన పాత్రలో ఎంతలా జీవిస్తారో అర్థంచేసుకోవచ్చు. 1979లో నిజామాబాదు జిల్లా మునిపల్లిలో ఎల్లమ్మకు నటరాజ రామకృష్ణ పరిచయమయ్యారు. అదే సంవత్సరంలో జిల్లా కలెక్టరేట్లో చిందు ఎల్లమ్మ తన తొలి అధికారిక ప్రదర్శన ఇచ్చింది. 1980లో అప్పటి ముఖ్యమంత్రి టీ అంజయ్య సమక్షంలో రవీంద్ర భారతిలో ఇచ్చిన ప్రదర్శన ఎల్లమ్మను కళాభిమానులకు దగ్గర చేసింది. శక్కరనగర్‌లోని బాలభవన్‌కు ఇందిరాగాంధీ వచ్చినప్పుడు ప్రదర్శించిన ఎల్లమ్మ బృందం చిందు కళారూపాలను చూసి ప్రధాని ఎంతగానో మెచ్చుకొని ఢిల్లీకి వచ్చి ప్రదర్శన ఇవ్వాలని స్వయంగా ఆహ్వానించారు. ఇందిరాగాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్లిన ఎల్లమ్మ బృందానికి అక్కడ ఆమె చనిపోయారన్న విషయం తెలిసింది. మరోసారి ఢిల్లీ వెళ్లి రాజీవ్ గాంధీ, సోనియాలను కలిసి తమ జానపద కళారూపాలను ప్రదర్శించింది. వయస్సు పైబడ్డ తర్వాత ఎటూ కదలలేని ఎల్లమ్మ తన మనవలు, మనవరాళ్లతో కాలం గడుపుతూ వారికి కూడా యక్షగానం, చిందు బాగోతం, ఇతర నాటకాలను నేర్పింది. వృద్ధాప్యంలో ఎల్లమ్మ కీళ్ల నొప్పు లు, ఇతర అనారోగ్యంతో 2005, నవంబర్ 10న తన 9౧వ ఏట తుదిశ్వాస విడిచింది.
ఎల్లమ్మను అలంకరించిన ప్రశంసలు, -పురస్కారాలు
- 50 ఏళ్లకుపైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చిన ఎల్లమ్మ అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకుంది.
- హైదరాబాద్‌లో నాటి సీఎం వైయస్ రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా రవీంద్రభారతిలో రాజీవ్ ప్రతిభా పురస్కారం (2004).
- నాటి సీఎం చంద్రబాబు నాయుడుచే సన్మానం (రూ.30 వేల పారితోషికం అందజేత)
- 1998-99 ఏడాదికి గాను- నల్లగొండ జిల్లా కళారత్న అవార్డు
- 1999లో హంస అవార్డు
- 1986లో ఢిల్లీలో అప్నా ఉత్సవ్‌లో జాతీయ సాంస్కృతిక మండలిచే సన్మానం
- 1991లో వరంగల్‌లో తెలంగాణ ప్రాంతీయ జానపద గిరిజన కళోత్సవంలో సన్మానం.
- 1998 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా యువజన సర్వీసుల శాఖచే సన్మానం
- 1994లో హైదరాబాద్‌లోని రవీంద్ర భారత్‌లో సంస్కార భారతి సంస్థ సన్మాన పత్రం
- 1982లో విశాఖపట్నంలో నటరాజ రామకృష్ణచేత ఆంధ్రప్రదేశ్ నృత్య అకాడమీవారి సన్మానం
- పుట్టపర్తిలో 16 రోజులపాటు కళా ప్రదర్శన. పుట్టపర్తి సత్య సాయిబాబా బంగారు గొలుసుతో సత్కారం
- రాష్ట్ర సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం (1982)
- రాష్ట్ర నృత్య అకాడమీ నుంచి నెలకు రూ. ఫెలోషిప్ మంజూరు (1982)
- నిజామాబాద్ నుంచి బోధన్ వరకు గల రహదారికి ఎల్లమ్మ రహదారిగా నామకరణం (2004)
ఆధునిక సొబగులు
చెవిరాల భాగయ్య, జిల్లా వెంకటదాసు, బూరుగుపల్లి వెంకటనరసయ్య పంతులు, యాదవదాసు వంటి రచయితలు కొత్త ఇతివృత్తాలపై కొన్ని నాటకాలు రచించి చిందు భాగవతాన్ని ఆధునీకరించారు. ప్రస్తుతం దాదాపు 800 చిందు భాగవత బృందాలున్నాయి. ప్రతి బృందం నైపుణ్యం కలిగిన ప్రదర్శకులుగా తయారు చేయబడింది. తమ కులానికి చెందిన ప్రతి కుటుంబం యక్షగాన ప్రక్రియలో శిక్షణ పొందుతుందని చిందు భాగవత కళాకారుడు సమ్మయ్య చెప్పారు. 300 కంటే ఎక్కువ రకాల ఆయుధాలను తమ నాటకాల్లో ప్రదర్శిస్తామన వెల్లడించారు.
చారిత్రక కళ
చిందు భాగవతం తెలంగాణలోని అతిప్రాచీన జానపద కళారూపాల్లో ఒకటి. ప్రజా బాహుళ్యంలో విస్తృతంగా ప్రదర్శించిన నాటక కళ. చిందు భాగవతం దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కనిపించే కట్టెక్కుట్టు తెరుక్కుట్టు, యక్షగానం తదితర జానపద థియేటర్ కళారూపాలకు చాలా దూరంగా ఉంటుంది. ఈ కళారూపం కాలక్రమేణా కమ్యూనిటీలోని ఒక చిన్న ఉప విభాగానికి పరిమితం కావ డం నుంచి ప్రాంతం అంతటా ప్రదర్శించబడేలా, రాష్ట్ర ప్రభుత్వంచే ఉపయోగించబడేలా అభివృద్ధి చెందింది. మాదిగ సామాజికవర్గంలోని ఒక ఉప వర్గం ఈ కళను ప్రదర్శించేవారు. తెలుగులో ’చిందు’ అనే పదానికి ’జంప్’ అని అర్ధం.
వారి ప్రదర్శన అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి, దీనికి చిందు భాగవ తం అని పేరు వచ్చింది. చాలా కథలు’ భాగవతం’లోనివే. ఆధునిక కాలంలో ఈ బృందాల నాయకు డు గడ్డం సమ్మయ్య. చిందు భాగవతులను సమాజంలోని అట్టడుగు వర్గంగా చూసినప్పటికీ, వారు తమ మూలాన్ని బాంబ మహాముని వంశంగా నమ్ముతారు. అందుకే చాలా నాటకాలు ’ఎక్కువాని మరి పలుకబోకుమురా, ఎక్కువ తెలిసి పలుకుమురా’ (ఎక్కువగా మాట్లాడకండి, ఎవరు ఉన్నతమై నవో తెలుసుకుని మాట్లాడండి) అనే ప్రారంభ పల్లవితో ’జాంబ పురాణం’తో మొదలవుతాయి.






