కోట్లనర్సింహులపల్లె చరిత్ర
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కోట్ల నర్సింహులపల్లె అపూర్వమైన నరసింహస్వామి శిల్పంతో ప్రసిద్ధం. మొత్తం దేశంలోనే ఇటువంటి పంచముఖ, షోడశ(16)బాహు నరసింహమూర్తి అరుదు. ఈ అర్ధ(ఉల్బణ)శిల్పం ప్రాచీనమైనది కూడా. శైవాగమంలో పేర్కొనబడిన ఉపా సకమూర్తి (తంత్ర) నారసింహుడు, వైష్ణవంలో దశావతారాలలో ఒక అవతారంగా ఆరాధింప బడుతున్నాడు.
కొండల్లో, గుట్టల్లోని గుహల్లో, రాతిగుండ్ల మీద వ్యక్తమైన రూపాలనే నరసింహస్వామిగా పూజించడం గిరిజన సంప్రదాయం నుంచి వచ్చినదనిపిస్తుంది. చెంచులక్ష్మి కథ నరసింహస్వామికి, గిరజనులకున్న అనుబంధాన్ని చెప్పే పురాణం. నరసింహస్వామి మూర్తులు కాశ్మీరం నుంచి కన్యాకుమారిదాక రెండు చేతులనుంచి 32 చేతులు కలిగి కనిపిస్తాయి. లక్ష్మీ సహితంగా, లక్ష్మీదేవి లేకుండాను వుంటాడు. హిరణ్యకశ్యపుని సంహరిస్తున్న రూపంలో వుంటాడు. యోగానంద రూపంలో కనిపిస్తాడు. లక్ష్మీసహితంగా శృంగారమూర్తిగా కనిపిస్తాడు. శంకరాచార్య నుంచి విజయేంద్రయతి దాక లక్ష్మీనరసింహస్వామి ఆరాధనలో స్తోత్ర, ధ్యాన మంత్రాలను రచించారు. బహురూపాల్లో ఆరాధింపబడే నరసింహుడు తాంత్రికుల దైవం కూడా. కోట్ల నరసింహుల పల్లె గ్రామం లో కనిపించే నిర్మాణాల ఆనవాళ్ళు వివిధకాలాలలో కట్టినట్లు, వేర్వేరు విధంగా కట్టడాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ రాష్ట్రకూటుల కాలంలోనే నిర్మించినట్లు చెప్పదగిన నిర్మాణశైలిలో వున్న లక్ష్మీనరసింహ, విశ్వనాథాలయాలున్నాయి. తర్వాతి కాలంలో కళ్యాణీ చాళుక్యులు, కాకతీయుల కాలాలలో కట్టించిన శైలిలో మల్లికార్జున, సోమనాథ, వీరభద్రాలయాలు అగుపిస్తున్నాయి.
దేవునిగుట్ట మీద నరసింహస్వామి అపురూపశిల్పం కారణంగా, కోటలున్నందువల్ల ఈ గ్రామానికి కోట్ల నర్సింహుల పల్లె అనే పేరు వచ్చింది. ప్రస్తుతం నరసింహమూర్తిలో రెండు తలలు స్పష్టంగా, ఒక తల రాలిపోయినట్టుగా, మిగతా తలలు ఛాయామాత్రంగా కనిపిస్తున్నాయి. కోట్ల నర్సింహుల పల్లెలో శాసనాధారాలు ఏవీ దొరక లేదు. శిల్పాలు, దేవాలయ నిర్మాణాలను ఆధారం చేసుకునే కాలనిర్ణయం చేయవలసి వస్తున్నది. గుట్ట మీద నందరాజుల(?) నాటి దిగా చెప్పుకునే రాతికోట శిథిలాలు అగుపిస్తాయి. నరసింహాలయానికి ఎదురుగా సీతారామాలయం, దానికవతల 16 స్తంభాల అర్థ మంటపం కనిపిస్తుంది. ఈ నిర్మాణం మనకు బాదామీ చాళుక్యుల కాలం నుంచి కనిపించే ఒక శైలి. శంకరాచార్యుడు దర్శించాడని నమ్మే విశ్వనాథాలయం వుంది. పక్కన నీటివూటల కోనేరు వుంది.
గుడివద్ద కల్వకోట కీర్తికుమార్ పేరుతో వేయించబడిన శిలాఫలకం మీద 1885లో కల్వకోట క్రిష్ణయ్య (రామడుగు) దేశపాండ్యకు స్వప్నసాక్షాత్కా రమిచ్చిన నరసింహస్వామి తనకు గుడి కట్టించమన్నాడట. నరసింహస్వామి గుడిని పునరుద్ధరించింది వీరే. వీరి వంశస్తులే దేవాలయ ధర్మకర్తలు. ఇక్కడ ప్రతియేటా చైత్రపౌర్ణమి నుంచి 3 రోజులు బ్రహ్మోత్సవాలు, రామనవమి, వైకుంఠ ఏకాదశి, నరసింహ జయంతి వేడుకలు జరుగుతాయి’ అని వుంది.
కోట్ల నర్సింహులపల్లెలో దొరికిన విడి శిల్పాలలో భైరవుడు, వీరగల్లు వున్నాయి. కోట ప్రదేశంలో ఇటీవలి కాలానికి చెందిన మట్టిగోడలు కనిపిస్తున్నాయి. అక్కడ శాతవాహనుల కాలంనాటి డిజైన్లున్న కుండ పెంకులు (కోటిలింగాల, కొండాపూర్) దొరికాయి. గ్రామంలో మట్టిఒరల బావులున్నాయని కూడా ప్రజలు చెప్పారు. పెద్ద ఇటుకల ముక్కలు లభిస్తున్నాయి. అన్నిటికన్నా విశేషం ఇక్కడ ఒక పొలంలో ఋషభుని ధ్యానాసనశిల్పం, పార్శ్వనాథుని శిల్పం బయటపడడం.
పార్శ్వనాథుని శిల్పం ఏడు పడగలతో గొడుగుపట్టిన సర్పంతో, దిగంబరంగా, కాయోత్సర్గ భంగిమలో నిల్చుని వున్న పార్శ్వనాథుని పాదాల వద్ద ఇరువైపుల యక్ష, యక్షిణులిద్దరు వున్నారు. శిల్పశైలి కళ్యాణీ చాళుక్యుల నాటిది. గుట్టమీద దొంగలజైలని పిలిచే ఇరుకైన లోతైన గుహను అన్వేషించారు చరిత్రబృందం సభ్యులు. జూన్ 25న కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, కొల్లూరి సాయి కోట్లనర్సింహుల పల్లెను సందర్శించి, కొండపైన కోటశిథిలాలను, దేవాలయాలను సందర్శించారు.






