23 April, 2026 | 3:12 AM

బోసిపోయిన కల్లూరు బస్టాండ్ సమ్మెతో రవాణా వ్యవస్థ స్థంభనం

23-04-2026 01:56 AM

కల్లూరు,ఏప్రిల్ 22(విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావంతో కల్లూరు బస్టాండ్ పూర్తిగా బోసిపోయింది.సాధారణంగా ప్రయాణికులతో కళకళలాడే బస్టాండ్ బుధవారం నిశ్శబ్దంగా మారింది.బస్సులు రోడ్లపైకి రాకపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వివిధ అవసరాల నిమిత్తం ప్రయాణించాల్సిన ప్రజలు ప్రత్యామ్నాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా విద్యార్థులు,ఉద్యోగులు,రోజువారీ కూలీలు గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూసినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో ప్రయాణికులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది ప్రయాణికులు ఆటోలు,ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తుండగా,అధిక చార్జీలతో ఆర్థిక భారం పెరుగుతోంది.అత్యవసర పనుల కోసం వెళ్లాల్సిన వారు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.సమ్మె త్వరగా ముగియాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.