కల్వకుర్తికి స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ
- వందెకరాల్లో ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
భూసేకరణలో రెవెన్యూ శాఖ నిమగ్నం
పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
నిరుద్యోగ యువతలో వెల్లువెత్తుతున్న హర్షం
రంగారెడ్డి, జూన్ 2౬(విజయక్రాంతి) : ఒకప్పుడు కరువుతో అల్లాడిన కల్వకుర్తి నియోజకవర్గం నేడు ఎడ్యుకేషన్ హబ్‌గా మారబోతోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాంత బిడ్డ కావడంతోపాటు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చొరవతో నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కల్వకుర్తి నియోజకవర్గానికి స్కిల్ డెవలప్‌మెంట్ యూని వర్సిటీ (వృత్తి నైపుణ్య) ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. 100 ఎకరాల్లో వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పర్యవేక్షణలో స్థల సేకరణపై రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు.
హామీని నిలబెట్టుకొట్టున్న ఎమ్మెల్యే
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పలువురు నేతలు పలు తంటాలు పడుతుంటారు. కానీ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లో ముందు వరుసలో ఉన్నారు. ఆయన పేరులో కసి ఉన్నట్టే అభివృద్ధి పట్ల కూడా అంతే కసిగా ముందుకు సాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నిక్ల కల్వకుర్తి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన హబ్‌గా మార్చుతానన్న హామీ కి స్కిల్ యూనివర్సిటీ మంజూరుతో బీజం వేశారు. దీంతో నిరుద్యోగులు ఎమ్మెల్యే తీరును అభినందిస్తున్నారు. తమ భవిష్యత్ మారనుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భూ సేకరణలో రెవెన్యూ శాఖ నిమగ్నం
స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు అనువైన స్థలాల అన్వేషణలో రెవెన్యూ అధికారులు నిమగ్నం అయ్యారు. కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, కందుకూరు ఆర్డీవో సురజ్‌కుమార్ ఆధ్వర్యంలో భూ సేకరణకు కసరత్తు మొదలు పెట్టారు. మండలాల వారీగా ప్రభుత్వ భూములు, అసైన్డ్, వక్ఫ్ భూముల వివరాలను సేకరిస్తున్నారు. కాగా, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి.. ఆర్డీవో శ్రీనుతో కలిసి వెల్దండ మండలం చెర్కూర్, పెద్దపూన్, కడ్తాల మండలం అన్మాస్‌పల్లి సర్వే నంబర్ 321, 260లలో గల ప్రభుత్వ భూములను పరిశీలించారు. అన్మాస్‌పల్లిలో 80 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించగా, సర్వే పూర్తిచేసి నివేదిక అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. స్కిల్ యూనివర్సిటీకి వంద ఎకరాలు కేటాయించనుండగా, 20 ఎకరాల్లో ఇంటగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.






