19-01-2026 12:14:34 PM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు.. తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు
ఆమనగల్లు,(విజయక్రాంతి): త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో(Municipal Elections) ప్రజాప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టాలని, నియోజకవర్గంలోని మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి(Kalwakurthy MLA Kasireddy Narayan Reddy) పిలుపునిచ్చారు. ఆదివారం ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు నియోజకవర్గవ్యాప్తంగా అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. తన పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కర్మన్‌ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయం, మైసిగండి మైసమ్మ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన కోరుకున్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యే కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి ఎక్స్ రోడ్ వంటి ప్రధాన కేంద్రాల్లో పర్యటించారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలపడానికి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పలుచోట్ల అన్నదానాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ....కాంగ్రెస్ పార్టీ రాబోయే మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు.
కల్వకుర్తి, ఆమనగల్లు మున్సిపాలిటీల్లో గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులను బరిలోకి దించుతామని ఆయన తెలిపారు. సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ప్రజా ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో ప్రజలు పూర్తి మద్దతు తెలపాలని కోరారు.పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సమరోత్సాహంతో సిద్ధమవ్వాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బాలాజీ సింగ్, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.