సికింద్రాబాద్‌లో కమల వికాసం
సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు కిషన్ రెడ్డికే మళ్లీ పట్టం
కలిసొచ్చిన అగ్రనేతల ప్రచారం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 4 (విజయక్రాంతి): సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో కమలం వికసించింది. మొదటి నుంచి ఊహించినట్లుగానే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గంగారపు కిషన్ రెడ్డి సిట్టింగ్ స్థానంలో పట్టు నిలుపుకొన్నారు. మొదటగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల నుంచి కొంత పోటీ ఎదురైనప్పటికీ, ఆ తర్వాత నుంచి ప్రతి రౌండ్‌లోనూ కిషన్ రెడ్డి తన ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చారు. మొత్తం 21,20,401 ఓట్లు ఉండగా కిషన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై 49,944 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. ఆ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ మొదటి రౌండ్ నుంచే వెనుకంజలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 45 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీ నెలకొంది. రెండు, మూడు స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నిలిచాయి.
బీజేపీ హ్యాట్రిక్..
సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థులు హ్యట్రిక్ విజయం నమోదు చేసుకున్నారు. 2014లో బండారు దత్తాత్రేయ సికిం ద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించగా, కిషన్ రెడ్డి 2019లో విజయం సాధించి మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేస్తున్నారు. 2024లో కూడా కిషన్ రెడ్డి విజయం సాధించడంతో రెండోసారి కూడా కేంద్ర మంత్రి అవుతారనే ప్రచారం జరుగుతోంది.
కలిసొచ్చిన అంశాలు..
కిషన్‌రెడ్డికి ఉన్న వ్యక్తిగత ఛరిష్మాతో పాటు ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డాల ప్రచారం ఆయనను విజయతీరాలకు చేర్చింది. కొద్దిరోజుల కిందట నియోజకవర్గ పరిధిలో చేసిన అభివృద్ధి పనులతో పాటు కేంద్ర మంత్రిగా రాష్ట్రంలో చేసిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేసిన ఆయన, తన విశ్వాసనీయతను చాటుకున్నారు. దానికి తోడు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు దానం నాగేందర్, పద్మారావు గౌడ్ ఎమ్మెల్యేలుగా ఉండడంతో వారు గెలిచినా ఉప ఎన్నిక వస్తుందని బీజేపీ ప్రచారం చేసింది.
కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి దాక..
సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందిన జీ కిషన్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురానికి చెందిన గంగాపురం స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు 1964 మే 15న జన్మించారు. ఆయనకు భార్య కావ్య, పిల్లలు వైష్ణవి, తన్మయ్ ఉన్నారు. 1977లో జనతాపార్టీలో యువనాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1980లో బీజేపీలో చేరారు. రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1983లో రాష్ట్ర కార్యదర్శిగా, 1985లో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1992లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2001లో బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా, 2002 వరకు బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 2023లో మళ్లీ బీజేపీ తెలంగాణ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు.
2004లో హిమాయత్‌నగర్, 2009, 2014లో అంబర్‌పేట, ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016 వరకు బీజేపీ శాసనసభ పక్షనేతగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి మోదీ మంత్రివర్గంలో హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2021లో కేబినెట్ విస్తరణలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మరో సారి సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందారు.
పజా సంక్షేమానికి కృషి చేస్తా
సికింద్రాబాద్ ఎంపీగా మరోసారి గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నా. నియోజకవర్గ ప్రజలకు మరోసారి సేవ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉంది. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా. నా విజయం కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు.
నియోజకవర్గం కాంగ్రెస్ బీజేపీ బీఆర్‌ఎస్ విజేత మెజారిటీ
సికింద్రాబాద్ 4,23,068 4,73,012 1,29,586 జీ కిషన్‌రెడ్డి 49,944






