13 July, 2026 | 8:37 PM

కంగువా నిర్మాతను ఆదుకుంటారట..

11-12-2024 12:00 AM

సినిమా రంగంలో చిత్రాలను నిర్మించి దెబ్బతిన్న నిర్మాతల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే వారిని ఆదుకునే నటులు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. కొందరు హీరోలు మాత్రం తమ చిత్రం కారణంగా నష్టపోయిన నిర్మాతను ఆదుకునేందుకు ముందుకు వస్తారు. తమ వంతు సహకారం అందిస్తారు. అలాంటి వారిలో సూర్య ఒకరు. సూర్య నిర్మాత కూడా కావడం వల్లనో ఏమో కానీ నిర్మాత కష్టం గురించి కూడా ఆలోచిస్తారు. ఇటీవల సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజాకు భారీ నష్టం వచ్చింది. 3డి ఫార్మాట్‌లో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. దీంతో బడ్జెట్ భారీగానే పెరిగిందని సమాచారం. తాజాగా ఈ చిత్రం విషయంలో సూర్య ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ‘కంగువా’ నష్టం నుంచి బయటపడేసేందుకు తిరిగి జ్ఞానవేల్ రాజాతోనే సూర్య మరో సినిమా చేయనున్నారట. దీంతో మంచి కథ కోసం సెర్చింగ్ ప్రారంభమైందట. దీనికి దర్శకుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది. సూర్య ప్రస్తుతం ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో 45వ చిత్రాన్ని చేస్తున్నారు. దీని తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో చేస్తారట. ఇవన్నీ పూర్తయ్యాక తిరిగి జ్ఞానవేల్ రాజాతో సినిమా చేస్తారని సమాచారం.