ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు తీయడమే లక్ష్యం
దాదాపు పుష్కర కాలం తర్వాత మళ్లీ ప్రేక్షకులను పలకరించనున్నారు సీనియర్ దర్శకుడువీ సముద్ర. 2001లో ‘సింహరాశి’ సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయన చివరగా 2013లో శ్రీకాంత్ నాయకానాయికలుగా ‘సేవకుడు’ చిత్రాన్ని తెరకెక్కించారు. మళ్లీ ఇప్పుడు సుమారు 12 ఏళ్ల తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారీ మాస్ డైరెక్టర్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
“క్లాస్ అయినా, మాస్ అయినా కుటుంబ సమేతంగా చూసేలా సినిమాలను రూపొందించాలన్న దృష్టి కోణంతోనే నేను పనిచేస్తుంటాను. అందుకే కాబోలు నేను తెరకెక్కించిన సినిమాలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. ‘సింహరాశి’, ‘శివరామరాజు’, ‘ఎవడైతే నాకేంటి’, ‘చండీ’, ‘మహానంది’, ‘పంచాక్షరి’ వంటి సినిమాలు చూసిన ప్రేక్షకులు.. మాస్ డైరెక్టర్‌గా నాకు వారి గుండెల్లో స్థానం ఇవ్వడం అదృష్టంగా భావిస్తాను. నేటి తరానికి అనుగుణంగా నాకు నేను అప్‌డేట్ అవుతూ ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సిద్ధమవుతున్నా. నా మిత్రులు, కుటుంబసభ్యుల సహకారంతో ఆరు చిత్రాలు తెరకెక్కించబోతున్నాను.
ఈ పుట్టినరోజు నాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే ‘వరదరాజు గోవిందం’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాలో సీనియర్ హీరో సుమన్ ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేశారు. అలాగే ‘రామజన్మభూమి’, ‘దో కమీనే’, ‘ఇండియా సీఈవో’, ‘కుంభ’, ‘నెమలి’ చిత్రాలు అండర్ ప్రొడక్షన్‌లో ఉన్నాయి.. వన్ బై వన్ సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు చేయడమే నా లక్ష్యం” అని తెలిపారు.






