29 August, 2026 | 9:01 PM

నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్

29-08-2026 07:58 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం శనివారం సుహృద్భావ వాతావరణంలో జరిగింది. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు హాజరయ్యారు.సమావేశంలో అజెండాలో పొందుపరిచిన అన్ని అంశాలపై సభ్యులు విస్తృతంగా చర్చించిన కార్పొరేటర్లు తమ తమ డివిజన్లలో నెలకొన్న ప్రజా సమస్యలు, పెండింగ్ అభివృద్ధి పనులు, మౌలిక వసతుల అవసరాలను మేయర్, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

అనంతరం అజెండాలోని అన్ని అంశాలకు సభ ఆమోదం తెలిపింది.రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, ప్రజారోగ్యం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. ప్రజల నుంచి వస్తున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటికి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలని మేయర్ అధికారులను ఆదేశించారు.నగర అభివృద్ధే అందరి ఉమ్మడి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రతి డివిజన్‌ కు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందుబాటులో ఉన్న వివిధ పథకాలు, నిధులను సమర్థవంతంగా వినియోగించుకొని నగరానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, అడిషనల్ కమిషనర్లు, వివిధ విభాగాల మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.