28 May, 2026 | 4:23 PM

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా

28-05-2026 03:47 PM

నేను రాజకీయ నాయకుడిని.. ప్రజలే దేవుళ్లు.

రాజ్యాంగబద్ధంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు.

అధిష్ఠానం ఆదేశాలకు కట్టుబడి ఉన్నా.

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా(Karnataka CM Siddaramaiah Resigns) చేశారు. డీకే శివకుమార్ తో కలిసి లోక్ భవన్ కి వెళ్లిన సిద్ధరామయ్య గవర్నర్ ప్రత్యేక కార్యదర్శికి రాజీనామా లేఖ సమర్పించారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ గైర్హాజరీలో ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్ రాజీనామాను స్వీకరించారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్(Governor Thawar Chand Gehlot) సాయంత్రం బెంగళూరు చేరుకోనున్నారు. లోక్ భవన్ వర్గాల ప్రకారం, గెహ్లాట్ వ్యక్తిగత కారణాల నిమిత్తం తన స్వస్థలమైన ఇండోర్‌లో ఉన్నారు. రాజీనామా సందర్భంగా సిద్ధరామయ్య(Siddaramaiah) మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. నా కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరు. సామాజిక న్యాయం, సమానత్వాన్ని నమ్ముతానని చెప్పారు. 

''నేను సీఎం పదవికి రాజీనామా చేశా.. లోక్  భవన్(Lok Bhavan)లో రాజీనామా లేఖ ఇచ్చా. గవర్నర్ వచ్చిన తర్వాత రాజీనామాను ఆమోదిస్తారు. హైకమాండ్ ఆదేశాలతో రాజీనామా చేశా. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పదవి నుంచి తప్పుకుంటున్నాను. భవిష్యత్ లో కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తా. గవర్నర్ తన రాజీనామాను ఆమోదిస్తారని భావిస్తున్నా. అధిష్ఠానం ఏ బాధ్యతలు అప్పగించిన స్వీకరిస్తా. రాజ్యాంగబద్ధంగా కొత్త ప్రభుత్వం ఏర్పాడుతోంది. నేను రాజకీయ నాయకుడిని.. ప్రజలే దేవుళ్లు. సీఎంగా నాకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే అవకాశమిచ్చారు.'' అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.