11-11-2025 12:14:31 AM
కిటకిటలాడిన రామలింగేశ్వరాలయం* !
నకిరేకల్, నవంబర్ 10 (విజయ క్రాంతి ): తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన నల్లగొండ జిల్లా, చెరువుగట్టు క్షేత్రంలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల సందడితో కళకళలాడింది. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తు లు ఆలయానికి పోటెత్తారు. కోనేటిలో స్నానమాచరించి, కార్తీక దీపాలను వెలిగించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘శివనామ స్మరణ‘తో ప్రాంతమంతా భక్తి వాతావరణాన్ని నింపింది.
లక్షకు పైగా భక్తులు, మూడు గంటల దర్శన సమయం
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. సుమారు లక్షకు పైచిలుకు భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. భారీ జన సందోహం కారణంగా స్వామివారి దర్శనం కోసం ప్రియదర్శనం ప్రత్యేక క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. ఒక్కో భక్తుడికి దాదాపుగా మూడు గంటలు పైగా దర్శనం సమయం పట్టింది. కార్తీక దీపాల వెలుగులతో ఆలయ పరిసరాలుశోభాయమానంగా మారాయి.గుట్ట కింద ఉన్న పార్వతమ్మ ఆలయం నుండి గుట్టపై ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం వరకు భక్తుల రద్దీ భారీగా కనిపించింది. జాతర కొట్లు, పూల దుకాణాలతో ప్రాంతమంతాకిటకిటలాడింది.
మొక్కులు చెల్లించుకున్న భక్తులు
భక్తులు మొక్కు కోడెలను పట్టుకుని గుట్ట కింద పార్వతమ్మ గుడిలో ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొత్త వాహనాలు కొన్న భక్తులు ఇక్కడే ప్రత్యేక పూజలు నిర్వహించడంతో వాహనాలతో గుట్టపైకి, కిందికి రద్దీగా మారింది. స్వామివారి సన్నిధిలో రాత్రిపూట నిద్రిస్తే చీడపీడలు తొలగిపోతాయని భక్తులు దృఢంగా విశ్వసిస్తారు. గుట్టపై ఉన్న ’మూడు గుండ్లు’ శివయ్య దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ గుండ్ల దర్శనం కోసం మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టినప్పటికీ, భక్తులు కష్టాలను భరిస్తూ తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఆలయ అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.