11-11-2025 12:13:26 AM
ఎస్పీ డాక్టర్ వినీత్
నారాయణపేట, నవంబర్ 10 (విజయక్రాంతి) : ఈ నెల 15వ తేదీన స్పెషల్ లోక్ అదాలత్ ఉన్న సందర్భంగా *జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ ప్రజలు, కక్షిదారులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ అనేది ఇరు పక్షాల సమ్మతితో కేసులను త్వరగా ,తక్కువ ఖర్చుతో పరిష్కారం చూపుతూ ప్రజలకు ఉపయోగకరమైన అవకాశం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజీ చేసుకునే అవకాశం ఉన్న కేసులు క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, వైవాహిక , కుటుంబ సమస్యలు, డ్రంకన్ డ్రైవ్, మోటార్ వాహన చట్ట ఉల్లంఘనలు, చెక్ బౌన్స్, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం వంటి వివిధ కేసులలో రాజీ కూర్చుకోవచ్చు అని తెలిపారు. చిన్న చిన్న కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోకుండా, రాజీ అనేది శాంతికి, పరిష్కారానికి సరైన మార్గం అని ఆయన పేర్కొన్నారు.
న్యాయశాఖ అందిస్తున్న ఈ ప్రత్యేక అవకాశాన్ని ప్రతి కక్షిదారు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా పరిధిలోని పోలీసు అధికారులు, SHOలు, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ లు సంబంధిత సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. తమ కేసులు రాజీ చేసుకోవాలనుకునే వారు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని ఎస్పీ తెలిపారు.