calender_icon.png 9 November, 2025 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయాభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర అపారము: మాజీ మంత్రి తలసాని

09-11-2025 04:40:07 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): సామాజిక, ధార్మిక సేవా కార్యక్రమాల్లో ఆర్యవైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani Srinivas Yadav) అన్నారు. ఆదివారం నెక్లెస్ రోడ్ లోని సంజీవయ్య పార్క్ లో ఆర్యవైశ్య గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆర్యవైశ్యులు ఒక వైపు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తూనే మరోవైపు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతారని వివరించారు. అదేవిధంగా దేవాలయాల నిర్మాణం, నిర్వహణలోను ఆర్యవైశ్యుల భాగస్వామ్యం ఉంటుందో ఆ దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని ప్రశంసించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బల్కంపేట ఎల్లమ్మ, కనకదుర్గమ్మ, మహంకాళి అమ్మవారు, గణేష్ ఆలయం వంటి ప్రముఖ దేవాలయాలలో తాను ప్రత్యేక చొరవ తీసుకొని అభివృద్ధి కమిటీలలో ఆర్యవైశ్యులకు ప్రాతినిధ్యం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో వన భోజనాల సందర్భంగా ఆర్యవైశ్యులు అంతా ఒకచోట కలుసుకోవడం ఎంతో సంతోషదాయకం అన్నారు. ఆర్యవైశ్యులకు తాను అన్ని వేళలా అండగా ఉంటూ వచ్చానని, ఇక ముందు కూడా ఉంటానని ప్రకటించారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బాబురావు, రమణయ్య, రాఘవేంద్రరావు, దీపక్, రమేష్, ప్రకాశం, సంపత్, సతీష్ తదితరులు ఉన్నారు.