21-02-2026 08:37:47 PM
గోవిందరావుపేట జీపీ భూమిలో అనధికార నిర్మాణాలు నిలిపివేయాలని ఆర్డీఓకు వినతి
కోనరావుపేట,(విజయక్రాంతి): వేములవాడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్‌కు అలాగే కోనరావుపేట మండల తహసీల్దార్ కు మండలంలోని గోవిందరావుపేట గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించిన భూమిలో జరుగుతున్న అనధికారిక ప్రైవేట్ మరియు మత సంబంధిత నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని లచ్చపేట తండా ప్రజలు తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. గ్రామపంచాయతీ అవసరాల నిమిత్తం గతంలో ప్రభుత్వం రెండు ఎకరాల భూమిని కేటాయించగా, అందులో ఇప్పటికే గ్రామపంచాయతీ భవనం నిర్మాణం పూర్తయ్యింది.
మహిళా సంఘ భవనం కూడా నిర్మాణ దశలో ఉందని వారు వివరించారు. భవిష్యత్తులో అదే భూమిలో ప్రభుత్వ పాఠశాల భవనం, ఆరోగ్య కేంద్రం (హాస్పిటల్)తో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ఇటీవల కొందరు ఇతర తండాలవారు కలిసి ఆ ప్రభుత్వ కేటాయించిన భూమిలో గుడి నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని, ఇది పూర్తయితే భవిష్యత్తు ప్రభుత్వ అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించిన విలువైన భూమిని ఈ విధంగా వినియోగించుకోవడం నిబంధనలకు విరుద్ధమని, వెంటనే ఆ పనులను నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వ భూమిని కాపాడుతూ, భవిష్యత్తులో పూర్తిగా ప్రజాప్రయోజనాలకు మాత్రమే వినియోగించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని లచ్చపేట తండా ప్రజలు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు.