31 March, 2026 | 1:57 AM

కవి కేసరి కపిలవాయి

31-03-2026 12:00 AM

నేడు లింగమూర్తి జయంతి :

తెలుగు ఆధ్యాత్మిక, చారిత్రక, సాహిత్య పరిశోధనా రంగంలో అరుదైన పరిశోధకుడు కపిలవాయి లింగమూర్తి. ఆయన అక్షర సేద్యం అసాధారణమైనది. నిశ్శబ్దంగా నిరంతర పరిశోధన చేస్తూ తెలుగు సాహితీ లోకాన్ని సుసంపన్నం చేసిన మహనీయుడు లింగమూర్తి. పద్యం, గద్యం, విమర్శ, పరిశోధన వంటి ప్రతి ప్రక్రియలోనూ తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా తెలంగాణ చరిత్రను, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆయన పాత్ర అజరామరం.

మరుగున పడిన చారిత్రక సత్యాలను వెలికితీసి భావి తరాలకు అందించడమే లక్ష్యంగా శ్వాస ఉన్నంత వరకు కలం పట్టిన అక్షర యోధుడు ఆయన. 1928 మార్చి 31న నాటి మహబూబ్ నగర్‌జిల్లా బల్మూర్ మండలం జినుకుంటలో మాణిక్యమ్మ, వెంకటాచలం దంపతులకు ఆయన జన్మించారు. కేవలం రెండున్నరేళ్ల చిన్న ప్రాయంలోనే తండ్రిని కోల్పోయిన లింగమూర్తి మేనమామ పెద లక్ష్మయ్య అండన పెరిగారు. అప్పట్లో నిజాం పాలన ఉండటంతో ప్రాథమిక విద్య మొత్తం ఉర్దూ మాధ్యమంలోనే సాగింది.

మాతృభాషపై మక్కువతో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహించిన పరీక్షలు రాసి తెలుగులో విశారద పట్టా సాధించారు. స్వయంకృషితో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో ఎం.ఏ పట్టా అందుకున్నారు. 1954లో నాగర్‌కర్నూల్ జాతీయోన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా తన వృత్తిని ప్రారంభించి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. 1972 నుంచి పాలెం శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఉపన్యాసకునిగా పనిచేసి 1983లో పదవీ విరమణ చేశారు.

పద్య రచనతో సాహితీ ప్రస్థానం మొదలుపెట్టినా కథలు, విమర్శ, జానపద సాహిత్యం, చరిత్ర పరిశోధనలో విశేష ముద్ర వేశారు. పాలమూరు జిల్లాలోని మరుగున పడిన చారిత్రక సత్యాలను, కోటలను, దేవాలయాల విశేషాలను ప్రపంచానికి చాటిచెప్పడంలో ఆయన కృషి అమోఘం. ఆయన కలం నుంచి సుమారు 130 కి పైగా గ్రంథాలు వెలువడ్డాయి. వీటిలో 13 శతకాలు, 9 సంకీర్తనలు, 7 కావ్యాలు, 18 చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. ముఖ్యంగా స్థల పురాణాలపై ఆయన చేసిన పరిశోధనలు అద్భుతం.

దేవాలయాల కథలకు ప్రాణం పోస్తూ చరిత్రను సజీవంగా ఉంచారు. లింగమూర్తి కేవలం రచయితగానే కాకుండా 500కు పైగా వ్యాసాలు రాశారు. సుమారు 320 పుస్తకాలకు పీఠికలు అందించి కొత్త తరం కవులను ప్రోత్సహించారు. ఆయన పాండిత్యాన్ని గుర్తించిన సాహిత్య లోకం ‘కవి కేసరి’ అనే బిరుదుతో సత్కరించింది. రాష్ర్టం ఏర్పడిన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న తొలి వ్యక్తిగా ఆయన ఖ్యాతి గడించారు.

2014 ఆగస్టు 30న నాటి గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా ఈ గౌరవం పొందారు. 2016లో రాష్ట్రప్రభుత్వ ఆవిర్భావ పురస్కారంతో పాటు మొత్తం 87 రకాల అవార్డులు ఆయనను వరించాయి. కృష్ణకాంత్ నుంచి నరసింహన్ వరకు ఎందరో గవర్నర్లు, ఎన్టీఆర్ నుంచి కేసీఆర్ వరకు ఎందరో ముఖ్యమంత్రులు ఆయనను ఘనంగా సన్మానించారు. లింగమూర్తి భాషాభిమానం ఎంతో గొప్పది.

పాఠశాలల్లో తెలుగు బోధన తప్పనిసరి చేయాలని ఆయన బలంగా కోరుకునేవారు. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే రావాలని ఎన్నో వేదికలపై వాదించారు. సమైక్య రాష్ర్టంలో తెలంగాణ సాహితీవేత్తలకు జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా ఎండగట్టారు. కపిలవాయి లింగమూర్తి రచనలు చదివి స్ఫూర్తి పొందడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.

 కామిడి సతీష్‌రెడ్డి, వ్యాసకర్త సెల్: 98484 45134