యుద్ధోన్మాదంపై గళం
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ప్రపంచశాంతికి పెను సవాల్‌గా మారాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు చివరకు మరో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన అనేక దేశాల ప్రజలు నిరసన బాట పడుతున్నారు. దీనిలో భాగంగానే అమెరికా ప్రజలు భగ్గుమన్నారు. దాదాపు 50 రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ‘నో కింగ్స్’, ‘నో వార్ విత్ ఇరాన్‘ అంటూ నినదించారు.
‘ఇది అవసరం లేని యుద్ధం’ అంటూ నిర్భీతిగా గళమెత్తారు. అతి స్పష్టంగా ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకించారు. ఆయనపై ఇరాన్‌పై దురాక్రమణ యుద్ధమేనని గర్జించారు. వారి నినాదాలతో చికాగో, లాస్ ఏంజిల్స్, అట్లాంటా వంటి ప్రధాన నగరాలన్నీ దద్దరిల్లాయి. ప్రధాన కూడళ్లన్నీ జన సందోహంతో నిండాయి. ‘ఇరాన్‌పై యుద్ధం వద్దు.. శాంతి కావాలి’, ‘మరో యుద్ధాన్ని మేం భరించలేం’, ‘వనరులను విధ్వంసానికి కాకుండా విద్య, వైద్యానికి ఖర్చు చేయండి’ వంటి నినాదాలతో హోరెత్తాయి.
నిరసనకారులు ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది‘ అంటూ ట్రంప్ నిర్ణయాలను ఎండగట్టారు. ‘నో కింగ్స్’ నిరసనలు అమెరికాలో బలపడుతున్న ప్రజాస్వామ్య చైతన్యానికి, ట్రంప్ నిరంకుశ వ్యతిరేక పోకడలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఒక శక్తిమంతమైన సంకేతం. ఈ ఉద్యమాన్ని కేవలం ఒక రాజకీయ నిరసనగా కాకుండా, పాలకుల నిర్ణయాలు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఉన్నప్పుడు పౌర సమాజం ఇచ్చే హెచ్చరికగా అర్థం చేసుకోవాలి.
ఒక దేశాధ్యక్షుడికి రాజు తరహాలో అపరిమితమైన అధికారాలు ఉండకూడదని, రాజ్యాంగబద్ధమైన జవాబుదారీతనం ఉండాలని అమెరికన్ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. చికాగోలో యుద్ధ ఖైదీల వారసులు, మిన్నియాపాలిస్‌లో ప్రజాస్వామ్య ప్రేమికులు.. ఇలా సమాజంలోని అనేక వర్గాల వారు ఏకమవ్వడమనేది అమెరికాలో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని సూచిస్తోంది. ముఖ్యంగా రిపబ్లికన్ల ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లోనూ నిరసనలు వెల్లువెత్తడం ట్రంప్‌పై వ్యతిరేకత తీవ్రంగా ఉందనడానికి ఉదాహరణ.
ఈ ప్రతిఘటన ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిదాయకం. అమెరికాలో మొదలైన ఈ యుద్ధ వ్యతిరేక నిరసనలు ప్రపంచమంతటా దావానలంలా వ్యాపించాయి. బ్రిటన్ రాజధాని లండన్‌లో వేలాది మంది ప్రజలు పార్లమెంట్ స్క్వేర్ వద్దకు చేరుకుని ‘స్టాప్ ది వార్’ నినాదాలతో హోరెత్తారు. ‘బ్రిటన్ రక్తపాతంలో భాగస్వామి కాకూడదు’ అని, ‘మధ్యప్రాచ్యంలో మరో వినాశనాన్ని మేం కోరుకోవడం లేదు’ అని డిమాండ్ చేశారు.
జర్మనీలోని బెర్లిన్ నగరంలో ప్రదర్శనకారులు చారిత్రక బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద శాంతియుత నిరసన చేపట్టి ‘యుద్ధం ఏ సమస్యకూ పరిష్కారం కాదు.. చర్చలే ఏకైక మార్గం’ అని నినదించారు. ఫ్రాన్స్‌లో పారిస్ వీధుల్లో యువతీ యువకులు, మేధావులు ‘మానవత్వం కంటే ఏ దేశ ప్రయోజనాలూ గొప్పవి కావు’ అని, ‘ఇరాన్ ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి సాగించే ఈ ఆధిపత్య పోరును వెంటనే నిలిపివేయాలి’ అని గర్జించారు.
ఇటలీలోని రోమ్ నగరప్రజలు యుద్ధంలో అసువులు బాసిన వారికి కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళి అర్పించారు. ‘యుద్ధం కేవలం విధ్వంసాన్ని మాత్రమే మిగులుస్తుంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా యుద్ధోన్మాదానికి ఏ దేశమూ మద్దతు ఇవ్వకూడదని, ప్రపంచ దేశాలన్నీ కలిసి యుద్ధంలో భాగస్వాములైన దేశాలపై దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చి శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తున్నారు.




