నెత్తుటి రెక్కలతో ఎగిరిన కొంగలు
చింగీజ్ ఐత్‌మాతోవ్.. నా జీవితం మీద అత్యంత ప్రభావం చూపిన రచయితల్లో ఈయన ఒకరు. ‘జమీల్యా’, ‘తొలి ఉపాధ్యాయుడు’, ‘తల్లీ భూదేవి’ తెలుగులో చదివినవే. అయితే, ఆయన నవలల్లో రెండిటిని కుమార్ కూనపరాజు ఈ మధ్యనే తెలుగులోకి తెచ్చారు. అందులో ఈ ‘కొంగలు ముందే ఎగిరాయి’ నవల కూడా ఒకటి. ‘రైటర్స్ మీట్’ వేదికగా ఆవిష్కరించుకున్న ఈ నవలని ఇన్నర్ పేజ్ మేకప్ చేస్తున్నప్పుడే చదివేసాను. ఇవాళ మళ్లీ చదివాను. చింగీజ్ ఐత్‌మాతోవ్ ఎప్పుడూ యుద్ధాన్ని నేరుగా వర్ణించడు. దాని ప్రభావానికి లోనయ్యే జీవితాల ద్వారా ఆ తీవ్రతని చెబుతాడు.
తల్లీభూదేవి (మదర్ ఎర్త్) జమీల్యా నవలలోనూ ఇదే పద్ధతిలో యుద్ధాన్ని చెబుతాడు. జమీల్యాలో ‘యుద్ధం సరదాగా మాట్లాడుకునే విషయం కాదు’ అంటూ అసహనంతో అరుస్తాడు ధనియార్ ఒకచోట. వీరులూ, విజయాలూ పైకి కనిపించినా, దాని వెనుక ఎంతటి విధ్వంసం, వినాశనం ఉంటాయో ఎన్ని ఆకలి కడుపులూ, మరెంత శ్రమ దోపిడీ, ఎన్ని కన్నీళ్లు ఉంటాయో ఆ నవలలు కళ్లకు కడతాయి. అలాంటి ఎన్నో విషయాలను ఈ ‘కొంగలు ముందే ఎగిరాయి’ నవల కూడా చెబుతుంది. బాల్యం ఎంత మధురంగా ఉంటుందో అన్నట్టుగా మొదలైన కథ యుద్ధం ఎంత క్రూరంగా ఉంటుందో కూడా చెబుతుంది.
నేపథ్యం ఇది..
సుల్తాన్ మురాద్ అనే ఓ మారుమూల పల్లెటూరి పిల్లవాడు ప్రపంచాన్ని అర్థం చేసుకునేలోపే, ఈ ప్రపంచం అతన్ని గాయపరుస్తుంది. గాలిలో స్వేచ్ఛగా ఎగిరే కొంగలలా విహరించాలని కలలు కన్న ఆ పసివాడు ఒక యుద్ధం కారణంగా భూమికి అతుక్కుపోతాడు.. ఇల్లు, అమ్మ, ఊరు, ప్రకృతి.. అన్నిటికంటే ముఖ్యంగా ఆకాశంలో ఎగిరే కొంగలూ. ఎంత అందమైందీ ప్రపంచం. ఎంత చక్కని ప్రకృతిలో ఉండే జీవితం.
అంతకన్నా ఇంకేం కావాలి. హాయిగా కిర్గిజ్‌కొండల్లో, స్తెప్ మైదానాల్లో కొంగలతో తానూ ఎగరాలనుకుంటూ తిరిగిన పిల్లవాడు వాడు. వణికించే చలిలో, పొలం పనులకోసం గుర్రాలని పోషించే బాధ్యత వాడిది. ఊరూ, తన పొలమూ, వాడి చుట్టూ ఉండే ప్రకృతీ, వాడి అందమైన ఊహలు.. హాయిగా సాగిపోయే జీవితం హఠాత్తుగా మారిపోతుంది. సుల్తాన్ మురాద్ మీద యుద్ధమేఘం కమ్ముకుంది.
దీంతో ఒక్కొక్క ఆనందం వాడినుంచి దూరమైంది. వాడు ఊహించుకున్నవే కాదు కంటికి కనిపించేవన్నీ కుప్పకూలిపోయాయి. ఎందుకు ఇలా జరుగుతున్నది? అసలు యుద్ధాలు ఎందుకు జరగాలి? ఎన్నెన్ని జీవితాలు ఇలా ఎవరికోసం నాశనం అవ్వాలి? ప్రతీ ప్రశ్నకీ సమాధానం ఆ యుద్ధానికి కారణమైనవాళ్ళకి తెలుసు. ఈ చిన్నోడికి మాత్రం ఆ సమాధానాలు ఎవరు చెప్పాలి? తండ్రి కోసం, తన మనుషుల కోసం ఎదురుచూపులు, చుట్టుముడుతున్న భయం, ఒంటరితనం కుంగదీస్తున్నా, ఎక్కడో కొంచెం ఆశ మాత్రం మిగిలే ఉంది.
కుర్రాడికి ఎన్నో కలలు
కళ్లముందే అంతా నాశనం అవుతున్నా వాడి కలలు మాత్రం కొత్త ఆశలని నింపుకుంటూ కొత్త దారులు వెతుక్కుంటూ, కొత్త ముగింపులని కోరుకుంటూ సాగాయి. వాడికున్న ధైర్యం నాన్న గుర్రం ‘చబ్దార్‘ , యుద్ధం ముగిసాక తిరిగి వచ్చే నాన్నని అదే గుర్రం మీద స్టేషన్ నుంచి తీసుకురావాలి. మళ్లీ పొలాన్ని దున్నాలి, పంట పండించాలి స్వేచ్ఛగా, సంతోషంగా ఆ అక్సాయ్ కొండ కోనల్లో పరుగులు తీయాలి. ఏ ఒక్క కలా నెరవేరే సూచనలేమీ లేవు, అయినా వాడిలో ఉండే ఆశ మాత్రం చావదు. ఏదో ఒకరోజు ఆ మంచుకొండల్లో స్వేచ్ఛాగాలులు వీస్తాయనే ఆశతోనే బతికాడు.
తన వయసుకు మించిన పనులు చేశాడు. అయితే, ఆఖరికి తానూ ఈ కుట్రపూరితమైన ప్రపంచంలో ఒకడిగా మారిపోయాడు. పసితనాన్నీ, అమాయకత్వాన్నీ, సున్నితత్వాన్నీ వదిలేశాడు. బతుకు మీద ఆశని తప్ప. ఇక్కడ మురాద్ అంటే కేవలం ఆ పిల్లవాడు మాత్రమే కాదు, అతని పొలమూ, గుర్రాలూ ఊహలూ అతనివి మాత్రమే కాదు మురాద్ మనందరికీ ఒక ప్రతీక, వాడు కన్న కలలన్నీ మనవే. అత్యంత విషాదం ఏమిటంటే అతనికి ఎదురైన దోపిడీ దొంగలూ, అతని మీద ఎగబడిన తోడేళ్లు మన మీద దాడిచేసే సామ్రాజ్యవాద ప్రతీకలూ కావచ్చు... మొత్తంగా మురాద్‌కి మనకూ అభేదమే. తనూ మనమూ వేరు వేరు కాదు.
చివరకు ఏమైంది..
‘మురాద్.. మురాద్.. రేయ్! ఎందుకురా ఇంత దుఃఖం ఇచ్చే లోకంలో పుట్టావు నువ్వు? ఎందుకురా అంత అందమైన కలలని కన్నావ్?’ దొంగలతో పోరాడి, గుర్రాలను కోల్పోయి నిలబడ్డాడు వాడు. ఆకలితో ఏమీ దొరకక ఎదురుపడిన తోడేలుని ఎదిరించటానికి గుర్రపు కళ్లాలతోనే ఎదురు నిలబడ్డాడు వాడు.. ఆ అక్సాయ్ కొండల పిల్లవాడు వాడు కచ్చితంగా గెలుస్తాడు, నిలబడతాడు. ఆ విషయం మనకు తెలుసు.
కానీ.. ఇప్పుడు సమస్య వాడిది కాదు.. ఈ ప్రపంచానిది. ఈ లోకానికి ఎంత దురదృష్టం, పాపం ఆ రోజుతో అది ఒక అమాయకమైన పిల్లవాన్ని కోల్పోయింది, కలలు కనే పిల్లవాన్ని, అందరినీ ప్రేమించే పసివాన్ని కోల్పోయి పోరాడే యోధున్ని తయారు చేసుకుంది. రక్తం రుచి చూసే మనుషుల్లోకి మురాద్ కూడా అనివార్యంగా ప్రవేశించాడు. నిజంగా ఈ ప్రపంచానికి పోరాడే యోధుల అవసరం ఏమిటి? ఏ దోపిడీ లేకపోతే, ఏ ఆధిపత్యమూ లేక పోతే, ఏ జాత్యహంకారాలూ, మనిషి మీద మనిషికి చిన్న చూపూ లేకుంటే ప్రపంచాన్ని ప్రేమించే వాళ్లకి తప్ప ఈ వీరులూ, యోధులూ,
చక్రవర్తులూ ఎందుకు? అసలు నిజంగా ఈ లోకానికి వాళ్ల అవసరం ఏముంది ? ఒకరిని ఒకరు చంపుకోవటం వీరత్వం అనిపించుకున్ననాడే ఈ సమాజంలో మనుషులం అని చెప్పుకునే అర్హత కోల్పోయామేమో కదా! ఇంతటి మహా విషాద విధ్వంస వినాశన గాథని రాస్తున్నప్పుడు ఐత్‌మాతోవ్ ఎంత దుఃఖపడ్డాడో. అనువాదం చేస్తున్న సమయంలో కుమార్ కూనపరాజు ఎంతకాలంపాటు ఈ అనిశ్చితిని ఎలా భరించాడో? అనిపించింది. ఆ రెండు గుండెలకూ, నాలుగు చేతులకూ ప్రేమపూర్వక ఆలింగనాలతో..




