20 April, 2026 | 4:29 AM

కేసీఆర్ రె‘ఢీ’

20-04-2026 02:43 AM

నేడు జగిత్యాలలో బీఆర్‌ఎస్ బహిరంగ సభ

  1. చాలాకాలం తర్వాత ప్రజాక్షేత్రంలోకి బీఆర్‌ఎస్ అధినేత

తనయ కవిత కొత్త పార్టీ.. డీలిమిటేషన్‌పై స్పందిస్తారా?

రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారా?

గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపేనా?

ఆయన ప్రసంగంపై సర్వత్రా చర్చ

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ కొంతకాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఒకటి రెండు సార్లు మాత్రమే బయటకు వచ్చిన ఆయన సోమవారం జగిత్యాలలో జరుగనున్న సభకు వచ్చి ప్రసంగిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. నిన్నమొన్నటివరకు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగిన జీవన్‌రెడ్డి తాజాగా గులాబీ గూటిలో చేరారు. ఈ సందర్భంగానే గులాబీ శ్రేణులు జగిత్యాలలో సభ నిర్వహిస్తున్నాయి.

మరోవైపు, ప్రభుత్వం పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లు గడుస్తున్న తరుణం.. ఇలాంటి సందర్భంలో గులాబీ అధినేత సభలో ఏం మాట్లాడతారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ సభ కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుం డా, రాష్ట్ర రాజకీయాల దిశను ప్రభావితం చేసే ఘట్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, వైఫల్యాలను కేసీఆర్ ఎండగట్టే అవకాశం ఉంది.

తమ పాలనలో అమలు చేసిన పథకాలను గుర్తుచేస్తూ ప్రస్తుత పరిస్థితులతో పోల్చే అవకాశం ఉంది. రాష్ట్రప్రభుత్వ పనితీరుపై అనేక ప్రశ్న లు సంధించే అవకాశం ఉంది. సంక్షేమ పథకాల అమలు, రైతు సమస్యలు, ఆర్థిక నిర్వహణ, పరిపాలనలో తీసుకున్న నిర్ణయా ల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయ త్నం చేయవచ్చు. అలాగే, కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన డీలిమిటేషన్, మహిళా బిల్లులపైనా స్పందించే అవకాశాలున్నాయి.

కీలక అంశాలపై కేసీఆర్ స్పందిస్తారా ?

తెలంగాణ రాజకీయాల్లో ఒకేసారి అనేక కీలక అంశాలు చర్చనీయాంశాలుగా మారిన క్రమంలో నేడు జగిత్యాల వేదికగా కేసీఆర్ అన్ని అంశాలపై స్పందిస్తారా అన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. తెలంగాణ ఆత్మగౌరవం నుంచి మహిళా బిల్లు వరకు, ప్రభుత్వ హామీల నుంచి పార్టీ అంతర్గత సమీకరణాల వరకు విస్తృత అంశాలపై కేసీఆర్ మాటలు ఎలా ఉండబోతాయన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.

తెలంగాణ ఆత్మగౌరవం అంశం మరోసారి సభలో ప్రధానంగా వినిపించే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్ర గౌరవంపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తెలంగాణ స్వాభిమానాన్ని కాపాడాల్సిన అవసరాన్ని కేసీఆర్ బలంగా ఉద్ఘాటించే అవకాశం ఉంది. ఇది కేవలం రాజకీయ విమర్శ మాత్ర మే కాకుండా భావోద్వేగ అనుసంధానం పెంచే ప్రయత్నంగా మారవచ్చు.

మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి జాతీయ అంశాలపై కూడా కేసీఆర్ స్పందించే అవకాశం ఉంది. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం, అమలు విధానం, దాని ప్రభావం వంటి కోణాల్లో ఆయన అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశముంది. అదే సమయంలో మహిళల సంక్షే మంపై తన పాలనలో తీసుకున్న చర్యలను కూడా గుర్తుచేసే ప్రయత్నం ఉండొచ్చు.

కవిత పార్టీ అంశంపై కేసీఆర్ స్పందిస్తారా?

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఉద్భవించనున్న నేపథ్యంలో ఈ అంశం కూడా సభలో ప్రస్తావనకు రావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తారా? లేదా దాటవేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వ విధానాల్లో భాగంగా చర్చనీయాంశమైన ఆర్టీసీ ప్రైవేటీకరణ, మేడిగడ్డ బరాజ్ మరమ్మతులు,

ఆరు గ్యారంటీల అమలు వంటి అంశాలపై కేసీఆర్ దూకుడైన విమర్శలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా హామీలు ప్రకటించడం ఒకటని, అవి అమలు కావడం మరొకటని పేర్కొంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసే అవకాశమున్నట్టు సమాచారం. ఉద్యోగుల సమస్యలు కూడా ఈ సభలో ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది. పెండింగ్ డిమాండ్లు, వేతన సమస్యలు, నియామకాల ఆలస్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయవచ్చు.

ఇది ఉద్యోగ వర్గాల్లో ప్రభావం చూపే అంశంగా మారుతుంది. అభివృద్ధి పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా కేసీఆర్ బలమైన వాదన వినిపించవచ్చని తెలుస్తున్నది. మూసీ పునరుద్ధరణ, హైడ్రా చర్యలు, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ ప్రజలపై ప్రభావం ఏమిటన్న దానిపై చర్చను మళ్లించే ప్రయత్నం చేయవచ్చు.

భవిష్యత్ నాయకత్వంపై సంకేతాలు వచ్చేనా ?

రైతుభరోసా వంటి పథకాల అమలు, రైతుల ప్రస్తుత పరిస్థితి కూడా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగంలో ఉండే అవకాశం ఉంది. తమ పాలనలో అమలు చేసిన రైతుసంక్షేమ పథకాలతో పోలుస్తూ, ప్రస్తుత పరిస్థితిని విమర్శించే వ్యూహం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక బీఆర్‌ఎస్ అంతర్గత రాజకీయాలు కూడా పరోక్షంగా ప్రస్తావనకు రావొచ్చు. ముఖ్యంగా కేటీఆర్, హరీశ్‌రావుకు సమాన అవకాశాల అంశంపై కేసీఆర్ ఎలాంటి సంకేతాలు ఇస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

పార్టీ భవిష్యత్ నాయకత్వంపై స్పష్టత ఇస్తారా లేక సమతుల్యతను కొనసాగిస్తారా అన్నది కీలకంగా మారింది. మొత్తంగా జగిత్యాల సభ ప్రభుత్వంపై విమర్శలు మాత్రమే కాకుండా, బీఆర్‌ఎస్ భవిష్యత్ వ్యూహం, అంతర్గత సమీకరణాలు, రాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ దృక్పథం వెలుగులోకి వచ్చే కీలక వేదికగా మారింది. అనేక కీలక అంశాలు ఒకే వేదికపై కలుస్తున్న ఈ సమయంలో కేసీఆర్ మాటలు తెలంగాణ రాజకీయాల దిశను ప్రభావితం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగిత్యాల వేదికగా కేసీఆర్ స్పష్టం చేసే అంశాలపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొన్నది.

రెండు సభలతో రాజకీయ ఉత్కంఠ

తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ ఉత్కంఠభరితంగా మారుతున్నది. ఒకవైపు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ కార్యక్రమాలు, మరోవైపు కేసీఆర్ బహిరంగ సభ వంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రతి సభ, ప్రతి ప్రకటనకూ ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చాలారోజుల తర్వాత ప్రజాక్షేత్రంలోకి రావడం, అదే సమయంలో ప్రభుత్వంపై పెరుగుతున్న విమర్శలు వంటి అంశాలు ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి.

రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు పెరుగుతుండగా ప్రజల్లో కూడా ఆసక్తి పెరిగింది. మీడియా, సోషల్ మీడియా వేదికలపై ఈ రాజకీయ పోరు మరింత స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రతి వ్యాఖ్య, ప్రతి స్పందన వెంటనే వైరల్ అవుతూ రాజకీయ చర్చలకు దారితీస్తున్నది. దీంతో సభల ప్రభావం కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నది.

ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై కేసీఆర్ దూకుడుగా విమర్శలు చేస్తే, దానికి ప్రతిస్పందనగా సీఎం రేవంత్‌రెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో రాజకీయ వేడి తారస్థాయికి చేరే అవకాశముంది. మొత్తంగా బీఆర్‌ఎస్ జగిత్యాల సభతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త దశ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ సమీకరణాలు మారుతాయా లేక మాటల యుద్ధం మరిం త ముదురుతుందా ? అన్న ప్రశ్నల మధ్య రాష్ట్ర రాజకీయ వాతావరణం పూర్తిగా ఉత్కంఠగా మారింది.