04-02-2026 01:28:04 AM
మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి) : విద్వేష పూరిత ప్రసంగాలు వద్దని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి సూచించినా .. దాన్ని పెడచెవిన పెట్టి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై దిగజారుడు వ్యాఖ్యలు చేశారని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి అన్నారు. రేవంత్‌రెడ్డి మాటలు సిట్ విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయాన్నారు. కేసీఆర్ ఏనాడు కూడా విచారణను ఎదుర్కోను అని అనలేదు ..మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున మొదటి నోటీసు విచారణకు టైమ్ కోరారు. ఎన్నో విచారణలను రెండేళ్లలో ఎదుర్కొన్నాం. దేనికి భయపడం ’ అని ఆయన తెలిపారు.
మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ముమ్మాటికీ జాతిపితే.. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన చరిత్ర కేసీఆరేదనని, కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిర స్థాయిగా ఉంటారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డిది చీమ కాలంత ప్రమేయం కూడా లేదన్నారు. రేవంత్ ది కుక్క తోక వంకర అనే బుద్ధి అని, హార్వర్డ్ వెళ్లినా అంతరిక్షం వెళ్లినా రేవంత్ బుద్ధి మారదన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీల అమలు వదిలి గారడీ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని, కేసీఆర్ పదవులకు రాజీనామా చేసి సొంతగా పార్టీ పెట్టి తెలంగాణ సాధిస్తే ..రేవంత్ తన చిల్లర బుద్ధిని చాటుకుంటూ కేసీఆర్‌పై అదే పనిగా పిచ్చి విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని, జాతర నిర్వహణకు శాశ్వత ఏర్పాట్లు చేస్తామని సీఎం, మంత్రులు ఉత్తర కుమార ప్రగాల్భాలు పలికారని విమర్శించారు. 15 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయితే.. కనీస ఏర్పాట్లు చేయలేకపోయారని విమర్శించారు. . సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన భక్తులకు ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని మధుసూదనా చారి డిమాండ్ చేశారు.