18-07-2025 01:13:46 AM
- హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
- బంజారాహిల్స్ నాలాల్లో ఆక్రమణలపై ఆగ్రహం
- వర్షంలో సైతం అప్రమత్తమైన హైడ్రాబృందాలు
హైదరాబాద్,సిటీబ్యూరో జూలై 17 (విజయక్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో నాలాల ఆక్రమణలు, వరద నివారణ చర్యలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 3లోని జ్యోతి నెస్ట్ నివాసితులు ఫిర్యాదు చేయడంతో ఆయన స్వయంగా వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కేబీఆర్ పార్కు, నందినగర్ మీదుగా బంజారా హిల్స్ నుంచి జలగం వెంగళరావు పార్కులోని చెరువులోకి చేరే వరద కాలువను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా పైన 4 మీటర్ల వెడల్పుతో ఉన్న నాలా బంజారాహిల్స్ రోడ్డు నంబరు 3 వద్దకు వచ్చేసరికి కొన్నిచోట్ల 2 మీటర్లకే పరిమితమవ్వడాన్ని కమిషనర్ గుర్తించారు. రోడ్డు నంబరు 14తో పాటు 3 లోనూ నాలాలు కుంచించుకుపోవడం, ఒక మీటరు వెడల్పు ఉన్న పైపు లైను ఏర్పాటు చేయడంతో ఎగువ నుంచి భారీ మొత్తంలో వస్తున్న వరద పోటెత్తే పరిస్థితి ఏర్పడుతోందని కమిషనర్‌కు అధికారులు వివరించారు. నాలా వెడల్పును తగ్గించి, బఫర్ లేకుండా ఆక్రమణలకు పాల్పడటం పట్ల కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైనుంచి చివరి వరకూ నాలా వెడల్పును పరిశీలించి, వరద ప్రవాహానికి ఆటంకాలు లేకుం డా చూడాలని అధికారులను ఆదేశించారు.
భారీ వర్షంలోహైడ్రా బృందాల సేవలు
నగరంలో గురువారం కురిసిన వర్షంతో పలు చోట్ల రహదారులు జలమయం అయ్యాయి. కూకట్‌పల్లి, ప్రగతినగర్, వివేకానందనగర్, మియాపూర్, మూసాపేట, శేరిలింగంపల్లి, గండిమైసమ్మ, లకడికాపూల్, సికింద్రాబాద్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో హైడ్రా మాన్‌సూన్ ఎమర్జెన్సీ, డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండి వరద నివారణ చర్యల్లో నిమగ్నమయ్యాయి.
వరద సాఫీగా సాగేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాలు సాఫీగా సాగేలా జాగ్రత్త పడ్డాయి. పోలీసులు, జీహెఎంసీ, ట్రాఫిక్, ఫైర్ విభాగాలకు చెందిన కంట్రోల్ రూమ్‌లతో సమన్వయం చేసుకుంటూ హైడ్రా బృందాలు అవసరమైన చోట వెంటనే సేవలు అందించాయి. నగరంలో వరద ముంపును నివారించేందుకు హైడ్రా నిరంతరం కృషి చేస్తోందని అధికారులు వెల్లడించారు.