26 February, 2026 | 6:20 AM

టీచర్‌ను మా స్కూల్‌లోనే ఉంచండి

26-02-2026 12:42 AM
  1. డిప్యూటేషన్‌ను రద్దు చేయాలి
  2. మా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు
  3. తలమడుగు మండలం ఉండం గ్రామస్థుల ఆందోళన
  4. సర్కార్ బడికి తాళం వేసి నిరసన

ఆదిలాబాద్/తలమడుగు పిబ్రవరి 25 (విజయక్రాంతి) : తమ పిల్లల విద్యా భవిష్యత్తును అంధకారం చేస్తూ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయురాలిని వేరే పాఠశాలకు డిప్యుటేషన్‌పై పంపడాన్ని నిరసిస్తూ తలమడుగు మండలం ఉండం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. బుధవారం ప్రాథమిక పాఠశాలలో పని చేసే ఇద్దరు టీచర్లను బయటనే నుంచి తమ పిల్లలతో కలిసి గ్రామస్థు లు పాఠశాలకు తాళం వేసి, నిరసన వ్యక్తం చేశారు.

పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయురాలని డోర్లి గ్రామ పాఠశాలకు మూడు రోజులు డిప్యూటేషన్ పంపడాన్ని గ్రామస్తులు నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంఈవో వెంకట్రా వు మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లి గ్రామస్థులతో మాట్లాడారు. కానీ తమ టీచర్‌ను తమ కు కేటాయించే వరకు తమ పిల్లలను బడి కి పంపమంటు తల్లిదండ్రులు పిల్లలను ఇంటి కి తీసుకువెళ్లినట్లు ఎంఈఓ తెలిపారు. ఈ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడనున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా గ్రామ స్థులు మాట్లాడుతూ పాఠశాలలో మొత్తం 63 మంది విద్యార్థులకు గాను ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. అందులో ఒక  ఉపాధ్యాయురాలిని ఇక్కడ 3 రోజులు, వేరే పాఠశాలకు 3 రోజులు డిప్యూటేషన్ పై పంపడం వలన తమ పిల్లలు నష్టపోతారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

మండల విద్యాధికారికి సమస్య విన్నవించిన ఫలితం లేదని, జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకెళ్లిన  పరిష్కారం కాకపోవడంతో పాఠశాలకు తాళం వేసినట్లు తెలిపారు. వెంటనే ఉపాధ్యాయురాలి డిప్యూటేషన్ రద్దు చె య్యాలని లేని క్రమంలో తమ పిల్లలను పాఠశాలకు పంపమని, ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయురాలిని తమ పాఠశాలలోనే కొనసాగించేలా చూడాలని డిమాండ్ చేశారు.