వేడి పుట్టిస్తున్న కేజ్రీ
లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి దాదాపు నెలన్నర రోజులు తీహార్ జైల్లో గడిపిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు మధ్యంతర బెయిలుపై జైలునుంచి విడుదల కావడం ఆ పార్టీకి కొత్త శక్తిని అందించినట్లయింది. పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ప్రధానంగా పోటీ చేస్తున్న ఆప్ పరిస్థితి ఇన్ని రోజులుగా చుక్కాని లేని నావగా ఉండింది. అభ్యర్థులనయితే ప్రకటించినప్పటికీ స్టార్ క్యాంపెయినర్ అయిన కేజ్రీవాల్ జైల్లో ఉండడం, బెయిలు కోసం ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఈ రెండు రాష్ట్రాల్లో ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆ పార్టీ అయోమయంలో పడింది.
పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు, ఢిల్లీలోని ఏడు లోక్‌సభ సీట్లకు జూన్ 1న చివరిదశలో పోలింగ్ జరగనుంది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో పోటీ చేస్తున్న ఆప్ పంజాబ్‌లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. మొత్తం 20 స్థానాలకు నామినేషన్ల ఘట్టం పూర్తయి ప్రచార పర్వం మొదలయ్యే దశలో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిలు దొరకడం ఆ పార్టీకి కొండంత అండ లభించినట్లయింది.
కేవలం ఎన్నికల ప్రచారంలో మాత్రమే పాల్గొనడానికి అనుమతిస్తున్నట్లు, ముఖ్యమంత్రిగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించడానికి వీల్లేదని బెయిలు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. అంతేకాక, జూన్ 2న తిరిగి లొంగిపోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనకు శాశ్వత ఊరట లభించనప్పటికీ ఎన్నికల ప్రచారం పూర్తి స్థాయిలో జరపడానికి అవకాశం లభించినందుకు కేజ్రీవాల్ సంతోషిస్తూ ఉండవచ్చు. జైలునుంచి విడుదలయిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తాను ఢిల్లీ సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేయలేదో కారణాలు కూడా వివరించారు.
కాగా, కేజ్రీవాల్ బైటికి వచ్చినందున ఆప్ తన ప్రచార వ్యూహాలను తిరిగి రచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కేజ్రీవాల్ ప్రధాన ప్రచారకర్తగా ఆ పార్టీ ప్రచారం సాగాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ఇప్పటిదాకా ఆ పార్టీ చేసిన ప్రచారమంతాఒక ఎత్తు, ఇకపై జరిగే ప్రచారం మరో ఎత్తు. అందుకే కేజ్రీవాల్ క్షణం వృథా చేయకుండా రంగంలోకి దిగారు. పది గ్యారెంటీలతో ఆప్ మేనిఫెస్టోను విడుదల చేస్తూ నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించి తీరాలన్నారు.
కూటమి గెలిస్తే దేశమంతటా ఉచిత కరెంటిస్తామన్నారు. మోడీ తర్వాత అమిత్ షా ప్రధాని అవుతారని, అందుకు అడ్డుగా ఉన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను పదవి నుంచి తప్పిస్తారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్‌తో కలిసి ఢిల్లీలో భారీ ర్యాలీకూడా నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే తాను జూన్ 5న జైలునుంచి బైటికి వస్తానంటూ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు భరోసా ఇచ్చారు.
‘ఇండియా’ కూటమిలోని అందరు నేతలు తనకు మద్దతు ఇస్తున్నారని చెప్పిన కేజ్రీవాల్ కూటమి అధికారంలోకి వస్తే దేశం గతి మారుతుందని కూడా స్పష్టం చేశారు. ఆప్ పార్టీని ముక్కలు చేయాలని ప్రధాని మోడీ అనుకుంటున్నారని, అది సాధ్యం కాదని కూడా ఆయన అన్నారు. జైల్లో తనను అనేక విధాలుగా అవమానించారని, అయినా తనకు హనుమంతుడి కృప ఉందని, తానేమీ జంకనని చెప్పుకొచ్చారు. కాగా, కేజ్రీవాల్ మధ్యంతర బెయిలుపై విడుదల కావడం లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను మరింత మెరుగు పరిచిందని ఆప్ నేత సౌరబ్ భరద్వాజ్ అంటున్నారు.
రాబోయే రోజుల్లో కేజ్రీవాల్ పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తారని, ఇండియా కూటమి తరఫున కూడా ప్రచారం చేస్తారని ఆయన చెప్పారు. కేజ్రీవాల్ జైలునుంచి విడుదల కావడం ఆప్‌కు ఎంతబలం ఇచ్చిందో ఆ పార్టీ నేతల మాటల్లోనే స్పష్టమవుతోంది. ఎన్నికల్లో ఆశించిన విజయం సాధిస్తే అది పార్టీకి కొండంత ధైర్యాన్ని ఇవ్వడంతోపాటు బీజేపీపై కేజ్రీవాల్ సాగిస్తున్న పోరాటం మరింత ఊపందుకుంటుంది. ఇప్పుడు దేశ రాజకీయాలకు అది ఎంతయినా అవసరం.






