1 July, 2026 | 7:48 PM

Breaking News

బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •  

తొలి ప్రైవేట్ రైలుకు స్వాగతం

14-05-2024 12:00 AM

ఇండియన్ రైల్వేస్‌లోని ‘భారత్ గౌరవ్ యాత్ర’ ప్రాజెక్ట్‌లో భాగంగా ‘ఎస్‌ఆర్‌ఎంపీఆర్’ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ‘ప్రిన్సీ వరల్డ్ ట్రావెల్స్’ ప్రైవేట్ లిమిటెడ్ వారితో కలిసి మొట్టమొదటిసారిగా మన దేశంలోని కేరళలో ‘ప్రైవేటు పర్యాటక రైలు’ ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నది. జూన్ 4న దీనికి పచ్చజెండా ఊపనున్నారు. తిరువనంతపురం నుంచి గోవా వరకు మొదటి ట్రిప్ నడపనున్నట్టు ‘ప్రిన్సీ వరల్డ్ ట్రావెల్స్’ ప్రకటించింది. దీని ప్రధాన లక్ష్యం పర్యాటకులను ఆకర్షించడమే. సౌకర్యాలు బాగుంటే దీనికి తిరుగు ఉండదు.

ఈ రైలు దారి పొడుగునా చక్కటి ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు. వెళ్ళే దారిలో తగిలే ముఖ్యమైన స్టేషన్స్‌లలో త్రివేండ్రమ్, కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం, కొజీకోడ్, కన్నూర్, కాసర్ గోడ్ మొదలైనవి వున్నాయి. భవిష్యత్తులో ఈ తరహా ప్రైవేట్ రైలు సౌకర్యాన్ని ముంబై, అయోధ్య ప్రాంతాలకు కూడా నడపనున్నట్టు ప్రణాళికలు జరుగుతున్నాయి. కేరళలో మొదలయ్యే తొలి ప్రైవేటు రైలులో మొత్తం 750 మంది ప్రయాణించవచ్చని తెలుస్తోంది. రెండు స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 11 మూడో తరగతి ఏసీ కోచ్‌లు, 2 రెండో తరగతి ఏసీ కోచ్‌లు ఉంటాయి. 60 మంది సిబ్బంది ప్రయాణికుల సేవల కోసం రైలులో అందుబాటులో వుంటారు.

సీనియర్ సిటిజెన్స్‌ను పట్టించుకోండి!

మార్గమధ్యంలో ప్రయాణికులకు అనారోగ్య సమస్యలు వస్తే ఆదుకోవడానికి వైద్య సిబ్బంది కూడ అందుబాటులో ఉంటారు. అందరూ ప్రయాణికులతో గౌరవభావం తో ఉంటారనే భావిస్తున్నారు. ఎందుకంటే, ప్రాజెక్ట్ లక్ష్యమే అది కనుక. ఈ రైలు ప్రయోగాత్మకంగా తిరువనంతపురం నుంచి గోవా వరకు నడుస్తుంది. భారత్‌లోనే లెక్కలేనన్ని సుందర ప్రదేశాలు, ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు ఇలాంటి ప్రైవేట్ రైళ్లు చక్కని సౌకర్యాలు, నాణ్యమైన సేవలు, రక్షణ వైద్య సదుపాయాలతో నడపగలిగితే మన దేశంలో డిమాండ్‌కు కొదువ వుండదనే చెప్పాలి. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్‌కు రాయితీ ఇవ్వగలగాలి. 

ఇప్పుడు ఉన్న రైల్వేశాఖ వారి రైళ్లు ఆయా ప్రాంతాలకు క్రిక్కిరిసి పోతున్నాయి. బెర్తులు, సీట్లు దొరకడం పెద్ద గగనమవుతున్నది. ప్రైవేట్ రైళ్లలో సీనియర్ సిటిజన్స్, మహిళలు, పిల్లలను ప్రత్యేక కేటగిరీ కింద తీసుకోగలగాలి. నిలబడి ఎవరూ ప్రయాణించడానికి వీలుండకుండా చూడాలి. అప్పుడే సముచితమైన పర్యాటక లక్ష్యం నెరవేరుతుంది. 

రైళ్ల నిర్వహణ బాగుంటే మరిన్ని ప్రైవేటు రైళ్లు రావడానికి వీలుంటుంది. ప్రైవేట్ రైళ్లు రావడం వల్ల అటు ప్రభుత్వానికి కూడ ఆదాయం వస్తుంది. మౌలిక వసతులు, మెరుగైన సౌకర్యాలతో ఈ తరహా ప్రైవేట్ రైళ్లకు ప్రజల ఆదరణ తప్పక వుంటుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కాకపోతే, ధనార్జనే ప్రధాన ఎజెండాగా కాకుండా క్రమశిక్షణ, సేవాభావం ప్రాతిపదికన నడుపగలగాలి. 

 కనుమ ఎల్లారెడ్డి

సెల్: 93915 23027