అమెరికాలో మేడ్చల్ జిల్లా వాసి హత్య
మృతుడి స్వస్థలం గుండ్లపోచంపల్లి
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
తప్పించుకున్న దుండగులు, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
వాషింగ్టన్, జూన్ 7: అమెరికాలో తెలంగాణ ఐటీ నిపుణుడి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. అదనపు ఆదాయం కోసం పిజ్జా డెలివరీకి వెళ్లిన అన్షుల్ కుంచాపై గుర్తుతెలియని దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అన్షుల్ అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటన అమెరికాలోని ఫిలడెల్ఫియాలో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని గుండ్లపోచంపల్లి అన్షుల్ కుంచా స్వస్థలం. హైదరాబాద్‌లోని చైతన్యభారతిలో కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసి స్కాలర్‌షిప్‌పై అమెరికా వెళ్లాడు. పెన్సిల్వేనియాలోని డ్రెక్సెల్ విశ్వవిద్యాలయంలోని లెబోకాలేజ్ ఆఫ్ బిజినెస్ నుంచి మాస్టర్స్ పూర్తి చేసి డేటా అనలిక్స్ సంస్థలో సీనియర్ ప్రొడక్ట్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. వారంతంలో అదనపు ఆదాయం కోసం పిజ్జా డెలివరీ చేస్తుంటాడు.
ఈ నేపథ్యంలో శనివారం కూడా తనకు వచ్చిన ఓ ఆర్డర్‌లో పిజ్జా డెలివరీ చేయాలని వెళ్లాడు. అక్కడ ఎవరూ లేరు. ఇంతలోనే ముసుగు ధరించిన గుర్తుతెలియని ఇద్దరు దుండగులు అతనిపై కాల్పులకు తెగబడ్డారు. అన్షుల్ అక్కడికక్కడే కుప్పకూలాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఈ కేసును హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు.
ఈ హత్యపై భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. స్థానిక అధికారులు, అన్షుల్ కుటుంబ సభ్యులతో సంప్రదింపుల్లో ఉన్నామని తెలిపింది. కష్టసమయంలో కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొంది. అన్షుల్ కుంచ హత్య వార్త అతని స్వగ్రామం, బంధువులు, స్నేహితుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కష్టపడి పనిచేసే మనస్థత్వం, స్నేహశీలిగా అన్షుల్‌ను అభివర్ణిస్తున్నారు.
కన్నీరుమున్నీరవుతున్న కుంటుంబం..
అన్షుల్ హత్య వార్త తెలియగానే అతని కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ఇది పథకం ప్రకారమే చేసిన హత్య అని అతని సోదరి తన్వి ఆరోపించింది. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించాలని విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేసింది. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.






