24 July, 2026 | 5:00 PM

గుప్తనిధుల కోసం తవ్వకాలు.. కౌకుంట్ల శివారులో కలకల

24-07-2026 04:30 PM

కౌకుంట్ల: మండల శివారులోని పిల్లిగుండ్ల వద్ద ఉన్న శ్రీ ఆది కురుమయ్య స్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం... రాత్రి వేళ ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు ఏకంగా మూల విరాట్‌ను తొలగించి, విగ్రహం కింద సుమారు 12 అడుగుల లోతు వరకు తవ్వకాలు చేపట్టారు. తవ్విన మట్టిని ఒక ట్రాక్టర్‌లో బయటకు తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు.

శ్రావణ మాసం సందర్భంగా ఆలయాన్ని అలంకరించేందుకు వెళ్లిన గ్రామస్థులకు ఈ ఘటన వెలుగులోకి రావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. సమాచారం అందుకున్న సర్పంచ్ నరేశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి, గ్రామ పెద్దలు  భక్తులతో కలిసి ఆలయ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దుండగులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు చేశారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగించిన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.