8 June, 2026 | 12:38 PM

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో వర్ష బీభత్సం.. దెబ్బతిన్న మూడు విమానాలు

08-06-2026 11:14 AM

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆకస్మికంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం(Rain havoc) కురుస్తోంది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Indira Gandhi International Airport80 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు, భారీ వర్షం కారణంగా రన్‌వేపై గందరగోళం నెలకొనడంతో ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. గ్రౌండ్ సర్వీస్ వాహనాలు, విమానాశ్రయ పరికరాలు అదుపుతప్పి, పార్క్ చేసి ఉన్న మూడు ఎయిర్ ఇండియా విమానాలను ఢీకొట్టాయి.

దీంతో వాటికి తీవ్ర నష్టం వాటిల్లింది. మూడు విమానాల బాడీ, రెక్కల భాగం పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. మూడు విమానాలను తక్షణమే నిలిపివేసిన అధికారులు మరమ్మతులకు తరలించారు. ఒక విమానానికి తీవ్ర నష్టం వాటిల్లిన ట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ఆకస్మిక వర్షం వల్ల ఎయిర్ పోర్టు రన్ వే(Airport runway), టార్మాక్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద ప్రవాహానికి ప్రయాణికుల సామాగ్రి ఉన్న డబ్బాలు కొట్టుకుపోయాయి. ఢీకొట్టడానికి ముందే అదుపుతప్పి వస్తున్న వాహనాలను ఆపేందుకు ఒక గ్రౌండ్ సిబ్బంది రన్‌వేపై ప్రాణభయంతో పరుగెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతను ఎంత ప్రయత్నించినప్పటికీ, తుఫాను ధాటికి వాహనాలు తట్టుకోలేక క్షణాల్లో విమానాలను ఢీకొట్టాయి. 

ఈ ఘటన టెర్మినల్ 2 సమీపంలో సాయంత్రం 4:40 గంటల ప్రాంతంలో జరిగింది. అదృష్టవశాత్తు, ఆ సమయంలో పార్కింగ్ బేలో సిబ్బంది ఎవరూ లేరు, ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. ఢిల్లీని అతలాకుతలం చేసిన తుఫాను తీవ్రతను ఈ దిగ్భ్రాంతికరమైన ఫుటేజ్ స్పష్టం చేస్తోంది. ఇది భారత్ లోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటైన ఢిల్లీలోని కొన్ని భాగాలను గందరగోళ ప్రదేశంగా మార్చేసింది. గ్రౌండ్ సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటించకపోవడం వల్ల జరిగిన ఘటనపై డీజీసీఏ విచారణ చేపట్టింది.