ఇండస్ట్రీ కింగ్‌కి కీలక స్థానం
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఒక్క తెలుగులోనే కాక ఇటీవల ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారాయన. తాజాగా దిల్ రాజుకు తెలంగాణ ప్రభు త్వం కీలక పదవిని అప్పగించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా ఆయన్ను రేవంత్‌రెడ్డి సర్కార్ నియమించింది. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ పదవిలో దిల్ రాజు రెండేళ్లపాటు కొనసాగనున్నారు. పదవి వచ్చిన సందర్భంగా ఆయనకు ఇండస్ట్రీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సినీ పరిశ్రమలో 35 ఏళ్లకు పైగా సేవలు..
దిల్ రాజు తొలుత సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ నిర్మాతగా 35 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా కొనసాగుతున్నారు. సక్సెస్‌కు కేరాఫ్‌గా ఎన్నో తెలుగు చిత్రాలను ఆయన బ్యానర్ ‘శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్’ పతాకంపై నిర్మిస్తున్నారు. 1990లో ‘పెళ్లిపందిరి’ సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా దిల్‌రాజు కెరీర్ ప్రారంభ మైంది. 2003లో హీరో నితిన్ నటించిన సినిమాకు తొలిసారి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రం హిట్ తర్వాత ఆయన పేరు ‘దిల్’ రాజుగా మారింది.
ప్రస్తుతం ఆయన రామ్‌చరణ్ కాంబో లో భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ను నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే జనవరి 10న విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చేస్తున్నారు. ఇది జనవరి 14న విడుదల కానుంది. వేణు యెల్దండి దర్శక త్వంలో నిర్మించనున్న ‘ఎల్లమ్మ’ సినిమా చేస్తున్నారు. ప్రకటించాల్సిన సినిమాలు మరో మూడు ఉన్నాయని సమాచారం. ఇలా ఇప్పటికీ దిల్ రాజు అదే సక్సెస్‌తో దూసుకుపోతున్నారంటే.. సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్ కారణం. అయితే దిల్ రాజు అసలు పేరు అది కాదు.. వెంకటరమణారెడ్డి ఆయన అసలు పేరు. ఆయన నిర్మించిన తొలి సినిమా ‘దిల్’ హిట్ అవ్వడంతో ఆ సినిమా పేరుతోనే ఇండస్ట్రీ ప్రముఖులు, నటీనటులు, సాంకేతిక విభాగాల వారు పిలువనారంభించారు.
‘దిల్‌రాజు డ్రీమ్స్’ వేదికగా టాలెంట్ వెలికితీత
చిన్న చిత్రాలనూ నిర్మిస్తూ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నారు దిల్ రాజు. ‘బలగం’ లాంటి చిన్న సినిమా లను నిర్మిస్తూ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నారు.. తద్వారా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. తెలుగు పరిశ్రమలోకి కొత్తగా వచ్చేవాళ్లను మరింతగా ప్రోత్సహించేందుకు ‘దిల్‌రాజు డ్రీమ్స్’ పేరుతో కొత్త బ్యానర్‌ను ఏర్పాటుచేశారు.
సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు
తనను ప్రభుత్వం డీఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమించిన సందర్భంగా టాలీవుడ్ సినీ నిర్మాత దిల్ రాజు శనివా రం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి, తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం.. దిల్ రాజుకు శాలువాతో సత్కరించి, అభినందించారు. దిల్ రాజు వెంట ఆయన సోదరులైన నర్సింహరెడ్డి (మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్), సినీ నిర్మాత శిరీష్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.






