ఆకలి తీర్చేందుకు వన్యప్రాణుల వధ
- కరువు నేపథ్యంలో నమీబియా ప్రభుత్వ నిర్ణయం
- 700 అరుదైన ప్రాణులను బలిచ్చి మాంసం పంపిణీ
- జాబితాలో 83 ఏనుగులు, 30 హిప్పోలు
నమీబియా, ఆగస్టు 29: ఆఫ్రికా దేశం నమీబియాలో ఏర్పడిన కరువు అక్కడి అడవి జంతువుల ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఆ దేశంలో 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు సంభవించడంతో ప్రజలకు కనీసం కడుపు నిండా ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడింది. దేశంలో కరువు తీవ్రత అధికంగా ఉండటం వల్ల నమీబియాలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. సుమారు 14 లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.
ఈ సంఖ్య దేశ జనాభాలో సగం కావడం గమనార్హం. దీంతో వన్యప్రాణులను బలిచ్చి ఆ మాంసం పంచాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 700 అరుదైన అడవి జంతువులను వధించేందుకు సిద్ధమవుతోంది. వీటిల్లో ఏనుగులు, జీబ్రాలు, హిప్పోలు వంటి జంతువులు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని నమీబియా పర్యావరణ, అటవీ, పర్యాటక మంత్రిత్వ శాఖలు స్వయంగా వెల్లడించాయి.
ప్రజల ఆకలి తీర్చేందుకే
వీరి ప్రకారం ఈ జాబితాలో 83 ఏనుగులు, 30 హిప్పోలు, 60 అడవి దున్నలు, 50 ఇంఫాలాలు, 100 బ్లూవైల్డ్ బీస్టులు, 300 జీబ్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. వీటి సంఖ్య దేశంలోని అడవులు, ఇతర ప్రాంతాల్లో తగినన్ని ఉండటం వల్లనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టంచేశారు. వీటిని వధించేందుకు నిపుణులైన వేటగాళ్లను వినియోగించనున్నట్లు తెలిపారు. కరువు ప్రాంతాల్లోని ప్రజలకు సాయపడటం కోసమే ఈ కఠిన నిర్ణయానికి కారణమని పేర్కొన్నారు.
భారీ జంతువుల సంఖ్యను తగ్గిస్తే నీటి వనరులపైనా ఒత్తిడి తగ్గుతుందని నమీబియా అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా కరువు తీవ్రంగా ఉండటం వల్ల జనావాసాలపై వన్యప్రాణుల దాడులు పెరుగుతున్నాయని ప్రభు త్వం చెబుతోంది. ఈ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో మొత్తం 83 ఏనుగులను గుర్తించామని, వీటి మాంసాన్ని కరువు సహాయక కార్యక్రమాల్లో పంపిణీ చేస్తామని పేర్కొంది.
ఏనుగుల సంఖ్య ఎక్కువే
ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో ఆఫ్రికాలో ఏనుగుల సంఖ్య చాలా ఎక్కువ. ఖండంలోని దక్షిణ ప్రాంతంలోనే సుమారు 2 లక్షలకుపైగా వీటి జనాభా ఉంది. గతేడాది ఇవి కరువు బారిన పడి నీరు దొరకక భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి. బోట్సువానాలో 1.3లక్షల ఏనుగులు ఉండగా 2014లో వీటి వేటను అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. కానీ ప్రజల ఒత్తిడి కారణంగా 2019లో ఈ నిషేధాన్ని ఎత్తివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఏటా వేటకు సంబంధించి కోటాను అమలు చేస్తూ అనుమతులు జారీ చేస్తోంది. స్థానికులకు ఏనుగుల వేటనే ప్రధాన ఆదాయ వనరుగా ఉండటంతో ప్రభుత్వం తలొగ్గింది. మరోవైపు అంగోలాకు 8 వేలు, మొజాంబిక్‌కు 5 వేల ఏనుగులను బోట్సువానా ఇచ్చింది.




