బెంగాల్‌లో బాంబులు, కాల్పులు
- రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల హింసాత్మకంగా బంద్
- టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు
- కోల్‌కతాలో మాత్రం పాక్షికంగా బంద్ ప్రభావం
- భారీ భద్రత మోహరించిన రాష్ట్ర ప్రభుత్వం
కోల్‌కతా, ఆగస్టు 28: పశ్చిమబెంగాల్‌లో బుధవారం బీజేపీ చేపట్టిన 12 గంటల బంద్ ఉద్రిక్తతలకు దారి తీసింది. పలు చోట్ల బాంబు పేలుళ్లు, కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. మరికొన్ని చోట్ల బీజేపీ, టీఎంసీ కార్య కర్తలు ఘర్షణలకు దిగారు. ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బీజేపీ తలపెట్టిన బంద్‌కు పశ్చిమబంగా ఛాత్ర సమాజ్ తప్ప మరే విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించలేదు. కోల్‌కతాలో జూడాపై అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ మంగళవారం విద్యార్థి సంఘాలు చేపట్టిన సెక్రటేరియెట్ ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది. ఛాత్ర సమాజ్ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగిం చడాన్ని నిరసిస్తూ బుధవారం 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
పలు చోట్ల ఘర్షణలు
ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భాత్పారాలో తన కారుపై టీఎంసీ మద్దతుదారులు బాంబులు విసిరారని బీజేపీ నేత ప్రియాంగు పాండే ఆరోపించారు. తన కారుపై ఏడురౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఇద్దరు గాయపడ్డారని మరో నేత అర్జున్‌సింగ్ తెలిపారు. ఈ ఘటనలో 8 మందిని అరెస్టు చేశారని, 8 బాంబ్ షెల్స్ రికవరీ చేసినట్లు తెలుస్తోంది. నాడియా, మున్షీబజార్‌లో తృణమూల్, బీజే పీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగినట్లు సమాచారం. భబిన్‌పూర్‌లో నిరసనకారులపై రసాయనాలు కలిపిన వాటర్ కెనాన్లను ప్రయోగించారని ఎమ్మెల్యే అగ్నిమిత్రపాల్ ఆరోపించారు.
సుప్రీంకోర్టు నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారని, స్త్రీల కోసం జరుగుతున్న పోరాటంలో మహిళలకు సైతం భద్రత కల్పించలేదని మరండిపడ్డారు. కోల్‌కతాలో పోలీసులతో ఘర్షణ పడిన కమలం శ్రేణులు టైర్లను తగలబెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రైలు సేవలకు చాలా చోట్ల తీవ్ర అంతరాయం కలిగింది. పట్టాలపై బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. తన పరిధిలోని 49 చోట్ల ట్రాకులను అడ్డగించారని ఈశాన్య రైల్వే ప్రకటించింది.
కోల్‌కతాలో కనిపించిన ప్రభావం
ఉత్తర బెంగాల్‌లో రాష్ట్ర రవాణా సంస్థ డ్రైవర్లు హెల్మెట్లు పెట్టుకుని కనిపించారు. బీజేపీ బంద్ వల్ల తమ భద్రత కోసం ప్రభు త్వం వీటిని ఇచ్చినట్లు తెలిపారు. కోల్‌కతా విషయానికి వస్తే బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. సాధారణ రోజుతో పోలిస్తే తక్కు వ సంఖ్యలో బస్సులు, క్యాబ్‌లు కనిపించాయి. భారీగా పోలీసులను మోహరించారు. శ్యాంబజార్ మెట్రోస్టేషన్‌ను మూ సేందుకు ప్రయత్నించిన ఏడుగురు అరెస్ట్ చేశారు. దుకాణాలు బంద్ చేయాలని చూసిన చాలామంది బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. బీజేపీ బెంగాల్ బంద్‌కు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది.
మేల్కొనాల్సిన సమయమిది
వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్య ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అదొక భయానక ఘటనగా అభివర్ణించారు. దీనిపై చాలామంది ఆగ్రహంతో ఉన్నారని.. అందులో తాను కూడా భాగమే నన్నారు. మహిళలపై నేరాల విషయంలో దేశమంతా మేల్కొనాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చాచరు. పీటీఐ వార్తాసంస్థకు రాసిన ప్రత్యే క వ్యాసంలో ఈ ఘటనపై తొలిసారి స్పందించిన రాష్ట్రపతి ముర్ము.. మహిళలపై అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజం అనుమతించదన్నారు. ఇలాంటి ఘటనలపై ఎప్పటికప్పుడు పౌరులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నా నిత్యం దేశంలో ఎక్కడో చోట నేరాలు జరుగుతూనే ఉన్నాయని, బాధితుల్లో చిన్నారులు సైతం ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు.




